English | Telugu

నాగచైతన్య, శోభితలపై విషం కక్కేందుకు సిద్ధపడుతున్న వేణుస్వామి!

‘శుభం పలకరా పెళ్లికొడకా..’ అంటే ఏదో అశుభం మాట్లాడినట్టు.. శుభకార్యాలు జరిగినా, సుఖ సంతోషాలతో ఉన్నా కొందరికి కడుపు మంట ఆగదు. ఏదో విధంగా వాటిని చెడగొట్టాలని, వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు వేణుస్వామి. అందరి జాతకాలు నాకు తెలుసు, ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది చెప్పగలను, ఎవరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ముందే చెప్పగలను అనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాడు. గత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారు అనే విషయంలో తను చెప్పిన కాలజ్ఞానం బెడిసి కొట్టడంతో తోక ముడిచి కొన్నాళ్ళు ముక్కున వేలేసుకొని కూర్చున్న ఆయన మళ్ళీ కొందరి జీవితాలపై బుస కొట్టేందుకు పడగ విప్పారు.

తాజాగా అక్కినేని ఫ్యామిలీలో, వారి అభిమానుల్లో ఆనందాన్ని నింపిన వార్త.. నాగచైతన్య, శోభిత దూళిపాళ్ళ ఎంగేజ్‌మెంట్‌. తన కుమారుడి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న అక్కినేని నాగార్జున.. వారి వైవాహిక జీవితం సంతోషకరంగా ఉండాలని ఆశీర్వదించారు. ఇది అందరూ సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మంచి జంటగా అందరి ప్రశంసలు అందుకోవడం మనకు తెలిసిందే. అయితే ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వారి వారి వ్యక్తిగత సమస్యల వల్ల ఇద్దరూ మర్యాద పూర్వకంగానే విడిపోయారు. దాన్ని కూడా అందరూ పాజిటివ్‌గానే తీసుకున్నారు. మళ్ళీ నాగచైతన్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే విషయంలో కూడా అందరూ ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ జరగడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్న విషయం.

అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించే సాధారణ ప్రేక్షకులు సైతం ఈ శుభకార్యాన్ని ఎంతో పాజిటివ్‌గా తీసుకుంటే.. వేణుస్వామి మాత్రం ఈ కొత్త జంటపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. నాగచైతన్య, శోభితల వైవాహిక జీవితం మీద సంచలనాత్మక జాతకపరమైన విశ్లేషణ రేపు చెబుతాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘శుభమా అని పెళ్ళి చేసుకోవడానికి ఓ జంట సిద్ధపడి ముందుగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటే దాన్ని కూడా నీ స్వలాభం కోసం, పబ్లిసిటీ కోసం వాడుకోవడం చాలా నీచం’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు ‘ఎంత జరిగినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఇక నువ్వు మారవా’ అంటూ ఫైర్‌ అయిపోతున్నారు. ‘మా జాతకాలు ఎలా ఉన్నాయి, మా వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది అని వాళ్ళు నిన్ను అడిగారా.. నీకెందుకు అంత దురద’ అంటూ మరికొందరు చురకలు వేస్తున్నారు.

వేణు స్వామిపై సొసైటీలో ఎక్కువ శాతం ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎవరి జీవితంలోనైనా మరు నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. వేణు స్వామి ముందుగా చెప్పిన విషయాలు కొందరి జీవితంలో సహజంగానే జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన తను చెప్పడం వల్లే జరిగిందని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్‌? ఇక చావు విషయానికి వస్తే.. ఎవరు ఎప్పుడు చనిపోతారు అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలనే అజ్ఞానం ఎవ్వరికీ ఉండదు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఫనాలా వారు చనిపోతారు అని ముందుగానే చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? దానివల్ల ఆయన సాధించేది ఏమిటి.. ఇవన్నీ సాధారణ ప్రజలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు. ఇకనైనా ఇలాంటి విపరీత ధోరణికి వెళ్ళకుండా, విమర్శల పాలు కాకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు.