English | Telugu
మాస్ మహారాజా.. పరువు పోయింది
Updated : Jan 21, 2016
వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు రవితేజ. బెంగాల్ టైటర్‌ని `బలవంతపు హిట్` ఖాతాలో చేర్చేశారు సినీ విశ్లేషకులు. సినిమా ఓ మాదిరిగా ఉన్నా, హిట్టయిందోచ్ అంటూ ఊకదంపుడు ప్రెస్‌మీట్లు పెట్టి.. హిట్ అనిపించారు. ఆ సినిమాతో రవితేజ మార్కెట్ వచ్చిన ఎదుగుదల ఏమీ కనిపించలేదు. దాంతో.. రవితేజ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలూ చేజారుతున్నాయి. దిల్‌రాజు సంస్థలో రవితేజ ఓ సినిమా చేయాల్సింది. కానీ ఇప్పుడు దిల్‌రాజు కూడా డ్రాప్ అయ్యాడు. కారణం.. పారితోషికం విషయంలో రవితేజ, దిల్‌రాజు మాటా మాటా అనుకోవడమే అట.
ఈ సినిమా కోసం రూ.7 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడు రవితేజ. 'అంత ఇవ్వలేను' అని బేరం పెట్టాల్సింది పోయి.. 'నీ మార్కెట్ పడిపోయింది.. రూ.7 కోట్లు నీకు చాలా ఎక్కువ' అన్నట్టు మాట్లాడాడట దిల్‌రాజు. దాంతో.. రవితేజకు కోపం వచ్చింది. `నీ సినిమా చేయడంలేదు` అనేశాడట. దిల్‌రాజు కూడా 'అవునా.. నాకూ అదే మంచిది' అన్నట్టు మాట్లాడాడట. దాంతో ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది. తన మార్కెట్ విషయంలో దిల్‌రాజు అలా మాట్లాడడం అవమానంగా ఫీలవుతున్నాడట రవితేజ. పరిస్థితులు బాగోలేనప్పుడు అంతే.. ఓ హిట్టు కొడితే అప్పుడు తడాఖా చూపించొచ్చు. మరి ఆ హిట్టేదో త్వరగా కొట్టేయ్ రాజా. ఓ పనైపోద్ది.