English | Telugu
టాలీవుడ్ స్టార్ లతో రామానాయుడు చిత్రాలు
Updated : Feb 18, 2015
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. దశాబ్దాలుగా ఆయన సినిమా రంగానికి చేసిన సేవను సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. యన్టీఆర్ తో 'రాముడు-భీముడు, స్త్రీజన్మ, శ్రీకృష్ణతులాభారం' చిత్రాలను నిర్మించిన రామానాయుడు, అక్కినేనితో 'సిపాయిచిన్నయ్య, ప్రేమనగర్, సెక్రటరీ, చిలిపికృష్ణుడు, ప్రేమమందిరం' వంటి సినిమాలను తెరకెక్కించారు.. కృష్ణతో 'బొమ్మలుచెప్పిన కథ, సావాసగాళ్ళు' తీసిన నాయుడు శోభన్ బాబుతో "జీవనతరంగాలు, సోగ్గాడు, చక్రవాకం, ఎంకి-నాయుడుబావ, కక్ష, దేవత"వంటి చిత్రాలను నిర్మించారు... శోభన్ బాబు-కృష్ణతో నాయుడు నిర్మించిన "మండేగుండెలు, ముందడుగు" చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి... చిరంజీవితో 'సంఘర్షణ', బాలకృష్ణతో "కథానాయకుడు, రాము", నాగార్జునతో 'చినబాబు' చిత్రాలను రూపొందించారు... తన తనయుడు వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'కలియుగపాండవులు' నిర్మించి విజయం సాధించారు... తరువాత వెంకటేశ్ హీరోగా "బ్రహ్మపుత్రుడు, ప్రేమ, బొబ్బిలిరాజా, కూలీ నంబర్ వన్, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ధర్మచక్రం, గణేశ్" వంటి చిత్రాలను నిర్మించారాయన ... టాప్ హీరోస్ తోనే కాదు ఇతర కథానాయకులతోనూ పలు చిత్రాలు నిర్మించారు నాయుడు... తన చిత్రాల్లో అడపా దడపా నటించి కూడా రామానాయుడు ఆనందించారు... ఒకప్పుడు నటుడు కావాలని కలలు కన్న రామానాయుడు తనయుడు వెంకటేశ్ హీరోగా సాధించిన విజయాలను చూసి పొంగిపోయారు.
తొలి చిత్రం 'రాముడు-భీముడు' మొదలు మొన్నటి 'దృశ్యం' దాకా రామానాయుడు చిత్రనిర్మాణంలో శ్రమించారు ... ఆయన సమర్పణలో చివరగా తెరకెక్కిన చిత్రం 'గోపాల గోపాల'... నిర్మాతగా తనదైన బాణీ పలికించిన రామానాయుడు తన తనయుడు సురేశ్ బాబుతోనూ కొన్ని సార్లు పోటీపడి సినిమాలు తీశారు... ఆయన ముందే ఎంతోమంది నిర్మాతలు వచ్చి మెరుపులు మెరిపించి వెళ్ళారు... అయినా రామానాయుడు మాత్రం నిర్మాతగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం! ఆయన నిర్మించిన శతాధిక చిత్రాల్లోఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి... వాటిలోని పాటలు,మాటలు,కథ,కథనం ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.... రామానాయుడు తన చిత్రాల ద్వారా జనం మదిలో సుస్థిరస్థానం సంపాదించారు.