English | Telugu
మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ : వర్మ
Updated : Feb 27, 2016
రియల్ లైఫ్ స్టోరీలు తీయడం, వివాదాస్పద చరిత్రలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వారు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదేమో. గతంలో పరిటాల రవీంద్ర జీవితంపై ‘రక్త చరిత్ర' సినిమా తీసిన వర్మ సక్సెస్ అయ్యాడు. ఇటీవల వీరప్పన్ జీవితం ఆధారంగా తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్' చిత్రం కూడా మంచి విజయం సాధించింది. తాజాగా ఆయన మరో వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుట్టారు. వంగవీటి హత్యోదంతంపై....ఆయన జీవితంపై సినిమా చేస్తున్నారు. వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నాడు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు తన చిత్ర కథాంశం ఉంటుందన్నారు. తన సినిమాలో నిజం మాత్రమే ఉంటుందే తప్ప ఏ ఒక్కరినో కించపరచడం, తప్పు చేసినట్టు చూపించడం ఉండదన్నారు. అప్పట్లో చోటుచేసుకున్న ఘటనలు, కారణాలు, పరిస్థితులు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పలువురిని కలవాల్సి ఉందన్నారు.అన్నట్లు వర్మ తన ట్విట్టర్ లో కూడా అప్పుడప్పుడు చంచలన వ్యాఖ్యాలను పోస్ట్ చేస్తుంటాడు. అలాగే మరోసారి తన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ముద్రగడను రియల్ మెగా పవర్ స్టార్ అని అభివర్ణించాడు. స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. తాను రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై నమ్మకం లేదని… ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానన్నాడు. తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని… తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లోకి వస్తానంటూ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు వంగవీటి సినిమా ప్రమోషన్లో భాగంగానే చేసినట్లుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.