English | Telugu

‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ

మూవీ : ప్రేమ విమానం
నటీనటులు: సంగీత్ శోభన్, శాన్వి మేఘన, అనసూయ భరద్వాజ్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, వెన్నెల కిషోర్, అభయ్ బేతిగంటి, గోపరాజ్ రమణ, సురభి ప్రభావతి, కల్పలత తదితరులు
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: అభిషేక్ నామా
దర్శకత్వం: సంతోష్ కట్టా
ఓటిటి: జీ5

'మ్యాడ్' సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగీత్ శోభన్ నటించిన మూవీ 'ప్రేమ విమానం'. శాన్వి మేఘన హీరోయిన్ గా, అనసూయ భరద్వాజ్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు పిల్లలు విమానం ఎక్కాలని కలలు కంటుంటారు. అయితే వాళ్ళ నాన్న చేసే పంట సరిగ్గా పండకపోవడం, అప్పుల బాధ ఎక్కువవడంతో అతను ఉరేసుకొని చనిపోతాడు. దాంతో రాము, లక్ష్మణ్ లని పెంచే బాధ్యత వాళ్ళ అమ్మ మీద పడుతుంది. తను రోజంతా కష్టపడిన వాళ్ళ అప్పు తీరకపోగ ఇంకా అదనంగా అప్పు చేయాల్సిన స్థితిలో ఉంటారు. ఇదే సమయంలో మరొక గ్రామంలో మణికంట అనే యువకడు అభిత అనే గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. మణికంట ఊరిలో కిరాణం షాప్ లో ఉంటాడు. అదే ఊరి సర్పంచ్ కి ఉన్న ఒక్కగానొక్క కూతురిని ప్రేమిస్తాడు. దానికోసం మణి దుబాయ్ లో పనిచేస్తున్న వాళ్ళ బామ్మర్ది రాజు హెల్ప్ తీసుకుంటాడు. మరి వాళ్ళిద్దరి ప్రేమ గెలిచిందా? రాము, లక్ష్మణ్ ఇద్దరు విమానం ఎక్కారా? రామ్, లక్ష్మణ్ కి మణి-అభిత లకి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే 'జీ5' లోని ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఒక కార్పోరేట్ ఆఫీస్ లో కొత్త లవ్ స్టోరీలని తీసుకురమ్మని ఎంప్లాయ్స్ ని తిట్టే మేనేజెర్ ని చూపిస్తూ డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్తాడు డైరెక్టర్. ఇక కొత్త కథల కోసం ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ 'ప్రేమ విమానం' అనే పుస్తకాన్ని పంపించడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇలా పుస్తకం లోని ఒక్కో పాత్రకి జీవం పోస్తూ కథని నడిపిన విధానం బాగుంది.

విమానం ఎక్కాలనే డ్రీమ్ తో రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు పిల్లలు పడే ఒడిదుడుకులు పేదవాళ్ళ జీవితాలని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఇక ఆ పిల్లలకి పాటలు చెప్పే గోపాల్ సర్(వెన్నెల కిషోర్) పాత్ర నవ్వించేస్తుంది. ఇక రాము, లక్ష్మణ్ ల అమ్మనాన్నలని చూస్తుంటే ప్రతీ ఊళ్ళో రైతులు పడే కష్టాలే కన్పిస్తాయి. ఇక ఇదే సమయంలో మణికంట, అభితల మధ్య ప్రేమ నడిపిన తీరు ఆకట్టుకుంది. తొంభైల్లో జరిగే కథని సహజసిద్ధంగా నడిపించడంలో, ప్రతీ పాత్రని సహజసిద్ధంగా చూపించడంలో డైరెక్టర్ సంతోష్ కట్టా పాస్ అయ్యాడు. సముద్రఖని తీసిన 'విమానం' సినిమా లైన్ ని తీసుకొని ఒక ప్రేమ కథని లింక్ చేస్తూ తీసిన ఈ 'ప్రేమ విమానం' కుటుంబ కథా చిత్రంగా మలిచాడు డైరెక్టర్. అడల్ట్ సీన్స్ ఏమీ లేకపోవడం ఈ సినిమాకి అదనపు బలం. ఇక దాదాపు ఇరవై నిమిషాల వరకు పాటలు సినిమాని డామినినేట్ చేశాయి. అయితే ప్రథమార్ధం కథలోకి తీసుకెళ్ళడానికి డైరెక్టర్ సంతోష్ కట్టా కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడనిపించింది.

చివరి నలభై అయిదు నిమిషాల్లో రెండు కథలని కలుపుతూ కథలోని పాత్రల శైలిని అద్భుతంగా మలిచాడు డైరెక్టర్. అయితే కథ ప్రథమార్ధంలో రెండు, మూడు నిమిషాల్లో అయిపోయే సీన్లని సాగదీసినట్టుగా తెలుస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్ కొన్ని పర్వాలేదనిపించాయి. " గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయే బ్రతుకులు మనవి, గాల్లో ఎగిరే బ్రతుకులు కావు" అని రాము, లక్ష్మణ్ లతో అనసూయ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'ఆనందమే ఉప్పొంగెనే' అనే పాట నచ్చుతుంది. బిజిఎమ్ బాగుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ మెయిన్ ప్లస్ అనే చెప్పుకోవాలి. హీరో, హీరోయిన్ కలుసుకునే ఆ హిస్టారికల్ లొకేషన్స్ ని చక్కగా చూపించాడు జగదీష్ చీకటి. అనూప్ రెడ్డి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సంగీత్ శోభన్ ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. అదేవిధంగా హీరోయిన్ గా శాన్వి మేఘన మొదటి సినిమా అయిన పర్వాలేదనిపించింది. తను ఇంకా అభినయాన్ని ప్రదర్శించి ఉంటే బాగుండేదనిపించింది. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ఆకట్టుకున్నారు. అనసూయ నటన సహజసిద్ధంగా ఉంది. గోపాల్ మాస్టర్ గా వెన్నెల కిషోర్ హాస్యాన్ని పండించాడు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:

విమానం ఎక్కాలన్న డ్రీమ్ ఓ వైపు, ప్రేమ కోసం విమానం ఎక్కిన జంట ఓ వైపు కలగలిపిన ఈ ' ప్రేమ విమానం' వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయోచ్చు.

రేటింగ్ : 2.75 / 5

✍🏻. దాసరి మల్లేశ్