English | Telugu

ఇండస్ట్రీపై పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక దృష్టి.. అన్ని విధాలా ప్రక్షాళనకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్‌.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుగారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్‌ కల్యాణ్‌గారు సూచించినా సానుకూలంగా స్పందించలేదు.

గత ప్రభుత్వ ఛీత్కారాలు

తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాలుచేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్‌ అసోసియేషన్‌ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు శ్రీ చంద్రబాబునాయుడుగారు, శ్రీపవన్‌ కల్యాణ్‌గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. శ్రీఅక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.
తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్‌ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీపవన్‌ కల్యాణ్‌గారు సూచించారు. శ్రీదిల్‌ రాజు, శ్రీఅల్లు అరవింద్‌, శ్రీడి.సురేశ్‌బాబు, శ్రీమతి వై.సుప్రియ, శ్రీచినబాబు, శ్రీసి.అశ్వనీదత్‌, శ్రీనవీన్‌ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది.

రిటర్న్‌ గిఫ్ట్‌ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీపవన్‌ కల్యాణ్‌గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్‌ కల్యాణ్‌గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్‌ కల్యాణ్‌గారు ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రిగారితో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీని ప్రకటిస్తారు.

థియేటర్ల ఆదాయంపై ఆరా

ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్‌ కల్యాణ్‌గారి పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా ఈ సందర్భంగా చర్చించారు. టికెట్‌ సేల్‌కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్‌ కల్యాణ్‌గారు పౌరసరఫరాలు శాఖమంత్రి శ్రీనాదెండ్ల మనోహర్‌గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీకందుల దుర్గేష్‌గారితోపాటు హోమ్‌ శాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.

రాష్ట్రంలో మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నాయి?

రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌ స్థాయి సినిమా హాల్స్‌ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్‌ థియేటర్లను కూడా రెండు మూడు స్క్రీన్స్‌గా విభజించి మల్టీప్లెక్స్‌ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్‌ ధరలు, సింగిల్‌ థియేటర్‌ టికెట్‌ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్‌లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్‌ల నిర్వహణ, వాటిలోని టికెట్‌ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు.

నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమగా అభివృద్ధి

కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల... అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని శ్రీపవన్‌ కల్యాణ్‌గారు యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోను, ఇప్పటికే చిత్రరంగంలో ఉన్నవారికీ ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్‌ లాంటివి ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్‌ వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగానే శ్రీపవన్‌ కల్యాణ్‌ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.