English | Telugu
‘అయల్వాశి’ మూవీ రివ్యూ
Updated : Jun 22, 2023
మూవీ: అయల్వాశి
నటీనటులు: సౌబిన్ షాహిర్, లిజోమోల్ జోష్, నిఖిలా విమల్, అఖిల భార్గవన్, బిను పప్పు, నస్లీన్ కే గఫూర్, గోకులన్, పార్వతీ బాబు, విజయ రాఘవ, షైన్ టామ్ చాకో తదితరులు.
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సజిత్ పురుషన్
ఎడిటింగ్: సిద్ధిక్ హైదర్
నిర్మాతలు: ఆషిక్ ఉస్మాన్, ముహ్సిన్ పరారీ
రచన, దర్శకత్వం: ఇర్షాద్ పరారీ
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
సౌబిన్ షాహిర్ నటించిన సూపర్‌హిట్ హారర్ కామెడీ చిత్రం ' రోమాంచం '. ఈ సినిమా తర్వాత తను నటించిన సినిమా 'అయల్వాశి'. నెట్ ఫ్లిక్స్ లో మళయాళంలో రిలీజైన ఈ సినిమా తాజాగా తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటో ఓ సారి చూసేద్దాం.
కథ:
థాజు, బెన్నీ, అజిప్పన్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఒకరోజు థాజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో అవసరం వచ్చి బెన్నీ స్కూటీని థాజు తీసుకెళ్తాడు. మరుసటి రోజు తన స్కూటీ మీద స్క్రాచ్ పడిందని, అది థాజు చేసాడని థాజుతో బెన్నీ గొడవపడతాడు. అలా ఆ స్కూటీ వల్ల స్నేహితులిద్దరు విడిపోతారు. థాజు తను తప్పు చేయలేదని నిరూపించడానికి, స్కూటీ మీద స్క్రాచ్ ఎవరు చేశారో కనిపెట్టాలనుకుంటాడు. మరి థాజు ఆ వ్యక్తిని కనిపెట్టగలిగాడా? స్నేహితులిద్దరు మళ్ళీ కలిసారా? లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఒక స్కూటీ మీద స్క్రాచ్, ఆ స్క్రాచ్ వల్ల గొడవ, గొడవ వల్ల మనస్పర్థలు, ఆ మనస్పర్థల వల్ల ఇద్దరు స్నేహితులు విడిపోవడం. ఇంత చిన్న విషయం చెప్పడానికి సినిమా తీయాలా అని అనుకుంటే మనం పొరబడినట్టే.. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే స్నేహితుడు అనుమానించాడు. పైగా ఇటువంటి చిన్న చిన్న విషయాల వల్లే మన జీవితాలలో కొన్ని గొడవలు జరుగుతుంటాయి. అలా అని ఇది సీరియస్ గా సాగే సినిమా కాదు. చాలా సహజంగా కథనం నడిపిస్తూ డ్రామాని పండిస్తూ దర్శకుడు ఈ సినిమాని చూపించాడు.
ఈ కథని చూపించడానికి డైరెక్టర్ ఎంచుకున్న నేపథ్యం చాలా బాగా కుదిరింది. పైగా ఆ ముగ్గురు స్నేహితులకు భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన కుటుంబ నేపథ్యాలు, ఆర్థిక పరిస్థితులు ఉండటంతో ఒకే సంఘటన ఆ ముగ్గురిపై ఒక్కోలా ప్రభావం చూపించింది. దానివల్ల వారి కుటుంబసభ్యులతో వారికి ఇబ్బందులు రావడం.. వాటిని పరిష్కరించడానికి వాళ్ళు చేస్తున్న పనులు ఒకవైపు నవ్వు తెప్పిస్తూనే, మరోవైపు వాళ్ళ మీద జాలి కలిగించాయి. ఈ మూడు పాత్రలే కాకుండా మిగిలిన పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతీ పాత్రకి బ్యాక్గ్రౌండ్ లో ఒక్కో స్టోరీ నడుస్తుంటుంది. దాని వల్ల సినిమా మరింత ఇంట్రెస్ట్ గా ఉంది. ఫస్టాఫ్ కథ కాస్త నెమ్మదిగా కదులుతుంది. కానీ సెకండాఫ్ లో కథలో వేగం పుంజుకొని సినిమాని చివరిదాకా చూడాలనే ఆసక్తిని కలుగజేస్తుంది.
ప్రతీ పాత్ర చాలా సహజంగా నటిస్తూ కథని చివరి దాకా ఆసక్తికరంగా ఉండేలా చేశాయి. సినిమాలో నెగెటివ్స్ పెద్దగా ఏమీ కనిపించలేదు. పరిస్థితుల వల్ల మంచివాళ్ళకి కూడా బాధలు తప్పవని చెప్పాలనుకున్న దర్శకుడు.. అక్కడక్కడ నవ్వులు పూయిస్తూ, కన్నీళ్ళు తెప్పిస్తూనే సినిమాని సరదాగా చూపించాడు. సినిమా నిడివి కూడా తక్కువే.. సరదాగా ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. సజిత్ పురుషన్ సినిమాటోగ్రఫీ సింపుల్ గా బాగుంది. సిద్దిక్ హైదర్ ఎడిటింగ్ బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
థాజు పాత్రలో సౌబిన్ షాహిర్ ఒదిగిపోయాడు. థాజు భార్య కుట్టిమలుగా లిజోమోల్ జోస్ ఆకట్టుకుంది. బెన్నీగా బిను పప్పు బాగా నటించాడు. అజిప్పన్ పాత్రలో గోకులన్.. మనకి తోడుగా ఉండే స్నేహితుడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే సహజంగా చేసాడు. పాచుగా నస్లేన్, కుంజీగా పార్వతీ బాబు, సల్మాన్ గా అజ్మల్ ఖాన్ ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్ర మేర సహజంగా నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ప్రతీ ఒక్క కుటుంబంలో చిన్న చిన్న తప్పులతో విడిపోతుంటారు. వాటిని ఎలా పరిష్కారించుకోవాలో తెలియజెప్పే ఈ సినిమాని అందరూ సరదాగా చూసేయొచ్చు.
రేటింగ్ : 3.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్
