English | Telugu
కృష్ణవంశీకీ నాగార్జునకీ మధ్య క్లాష్ ఎందుకు...?
Updated : Oct 4, 2014
నిన్నే పెళ్లాడతా సినిమాని నాగార్జున ఎప్పటికీ మర్చిపోలేడు. అఫ్ కోర్స్ కృష్ణవంశీ కూడా. కృష్ణవంశీ ఫ్యామిలీ డ్రామాలు ఎంత బాగా తీస్తాడో ఆ సినిమా తో పరిశ్రమకు అర్థమైంది. చంద్రలేఖ ఫ్లాప్ అయినా - మంచి సినిమానే. ఈ రెండు సినిమాలతో కృష్ణవంశీ, నాగార్జున మధ్య విపరీతమైన రాపో పెరిగిపోయింది. అయితే... సడన్‌గా ఈ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య `ఇగో` క్లాష్ అయ్యింది. ముచ్చటగా మూడో సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. ఆ క్లాష్ ఇప్పటికీ కొనసాగుతోందని ఫిల్మ్ నగర్ జనాల మాట.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఈ ముగ్గురి కోసం కృష్ణవంశీ ఓ కథ తయారు చేశాడు. అదే... త్రయం. ఈ కథని అక్కినేని కుటుంబం దాదాపుగా ఓకే చేసేసింది. ఈ ప్రాజెక్టుపై వంశీ యేడాది కష్టపడ్డాడు కూడా. చివరి క్షణాల్లో నాగ్... ఈ స్ర్కిప్ట్‌ని పక్కన పెట్టాడట. నాగ్ నిర్ణయంతో వంశీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఒక దశలో వంశీ ఫోన్ చేసినా.. నాగ్ సమాధానం ఇవ్వలేదని దాంతో వంశీ చాలా పర్సనల్‌గా ఫీలయ్యాడని, గోవిందుడు అందరివాడేలే టీజర్ ఆవిష్కరణ సభలో వంశీ కంటతడి పెట్టుకోవడానికి కారణం కూడా అదేనని ఇన్‌సైడ్ రిపోర్ట్. ఆ తరవాత అక్కినేని ఫ్యామిలీ మనం చేసిన సంగతి తెలిసిందే. త్రయం కథనే అటూ ఇటూ మార్చి గోవిందుడు అందరివాడేలే సినిమా తీశాడు వంశీ. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్లేదట. ఇప్పటికీ అంటీముట్టనట్టుగానే ఉన్నార్ట. నాగ్ వదిలేసిన కథని చరణ్‌కి చెప్పి, చిరుతో ఒప్పించి, ఇప్పుడో మంచి చిత్రంగా మలచగలిగాడు వంశీ. ఈ విషయంలో నాగ్‌పై విజయం సాధించానన్న తృప్తి... వంశీలో కనిపిస్తోందిప్పుడు. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. విజయాల వెంట పడడమే ఉంటుంది. మరిప్పుడైనా నాగ్, వంశీల మధ్య కమ్యునికేషన్ గ్యాప్‌కి తెర పడుతుందా?? మళ్లీ ఇద్దరూ కలుస్తారా? అన్నది కాలమే చెప్పాలి.