English | Telugu
పవన్ బాటలో నాగార్జున
Updated : Feb 4, 2015
ఇది వరకు మన హీరోలు కృష్ణుడి పాత్ర పోషించాలంటే హడలిపోయేవారు. `పెద్దాయన ఎన్టీఆర్ కృష్ణుడిగా చేశాక.. మేం చేస్తే బాగోదండీ..` అనేసేవారు. అదీ నిజమే.... తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ఎన్టీఆరే. కృష్ణుడన్నా ఎన్టీఆరే. అసలు దేవుడంటేనే ఆయన. ఆ పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టమే. అందుకే ఇలాంటి సాహసాలు చేయలేదు. కానీ.. `గోపాల గోపాల`తో పవన్ ఆ ధైర్యం చేయగలిగాడు. కృష్ణుడంటే నెమలిపించం, గోపికలు, వేణువు ఈ రొటీన్ గెటప్ ఊహించుకొంటే... అందుకు భిన్నంగా మోడ్రన్ కృష్ఱుడిగా అలరించాడు. అభిమానుల దగ్గరే కాదు, ప్రేక్షకుల దగ్గరా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ఈ ధైర్యంతోనే నాగార్జున కూడా కృష్ణావతారంలో కనిపించడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. కె.రాఘవేంద్రరావు - నాగార్జున కలయికలో ఓ భక్తిరస ప్రధాన చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ్ కృష్ణుడిగా కనిపిస్తారని సమాచారమ్. నాగ్‌పై ఓ ఫొటో కూడా జరిపినట్టు.. కృష్ణుడిగా నాగ్ అన్ని విధాలా బాగుంటాడని రాఘవేంద్రరావు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2015లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.