English | Telugu
అల్లరోడికి టెన్షన్ పట్టుకొంది
Updated : Feb 4, 2015
వరుస ఫ్లాపులతో మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్‌కి తుప్పు పట్టించుకొన్నాడు అల్లరి నరేష్. ఒకటా రెండా... వరుసగా అరడజను సినిమాలు తుస్సుమన్నాయి. దాంతో నరేష్ డేంజర్ జోన్‌లో పడిపోయాడు. ఇప్పుడు ఓ హిట్టు కొట్టి తనని తాను నిరూపించుకోవడం మినహా మరో గత్యంతరం లేదు. అదీ.. బందిపోటు ద్వారానే కొట్టాలి. ఎందుకంటే... హీరోగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నరేష్. మరోవైపు క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఇంద్రగంటి మోహనకృష్ణ నరేష్ టైపు ఊర కామెడీ చేయగలడా, లేదంటే క్లాసికల్ కామెడీలో నరేష్ ఇమిడిపోగలడా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలం తరవాత తన సొంత సంస్థ ఈవీవీ సినిమాస్ పతాకంపై వస్తున్న సినిమా ఇది. కాబట్టి తండ్రి పేరు నిలబెట్టాలన్నా అల్లరోడికి హిట్ పడాల్సిందే. నిజానికి ఈనెల 6న ఈ సినిమా విడుదల కావాలి. అయితే టెంపర్ కి భయపడిన ఈ బందిపోటు కాస్త వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఫిబ్రవరి 20న రావడానికి సమాయాత్తం అవుతున్నాడు. హీరోగా, నిర్మాతగా తన భవిష్యత్తు తెల్చేది ఈ బందిపోటే. అందుకే.. అల్లరోడికి అంత టెన్షన్ పట్టుకొంది. చివరికి ఏమవుతుందో చూడాలి.