English | Telugu
'మారన్' మూవీ రివ్యూ
Updated : Mar 12, 2022
సినిమా పేరు: మారన్
తారాగణం: ధనుష్, మాళవికా మోహనన్, స్మృతి వెంకట్, సముద్రకని, ఆడుకాలమ్ నరేన్, కృష్ణకుమార్, జయప్రకాశ్, మహేంద్రన్, రాంకీ, బోస్ వెంకట్, ఇళవరసు
కథ, స్క్రీన్‌ప్లే: షర్ఫు, సుహాస్
మ్యూజిక్: జి.వి. ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: వివేకానంద్ సంతోషమ్
ప్రొడక్షన్ డిజైనర్: అమరన్
నిర్మాతలు: అర్జున్ త్యాగరాజన్, సెంధిల్ త్యాగరాజన్
దర్శకత్వం: కార్తీక్ నరేన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిలిమ్స్
విడుదల తేదీ: 11 మార్చి 2022 (ఓటీటీ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
'కర్ణన్', 'జగమే తంత్రమ్' సినిమాల తర్వాత ధనుష్ నటించగా డైరెక్టుగా ఓటీటీలో విడుదలైన సినిమా 'మారన్'. 'కర్ణన్' సినిమా ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. థియేటర్లలో రిలీజైతే బాగుండుననే అభిప్రాయం కలిగించింది. 'జగమే తంత్రమ్' సినిమా చూసి, ఇది ఓటీటీలో రిలీజవడమే మంచిదైంది అన్నారు చూసినవాళ్లు. ఇప్పుడు 'మారన్'ను చూసినవాళ్లూ అదే అంటున్నారు. అవును. సినిమా అలా ఉంది మరి!
కథ
మారన్ తండ్రి (రాంకీ) ఒక నిఖార్సైన జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా రాసే ఆయన ఒక మంత్రికి సంబంధించిన స్కామ్‌ను తను పనిచేసే పేపర్ ద్వారా వెల్లడిస్తాడు. రెండోసారి గర్భం దాల్చిన ఆయన భార్యకు సరిగ్గా అప్పుడే పురిటి నొప్పులు వస్తాయి. రాత్రివేళ ఆమెను తీసుకొని హాస్పిటల్‌కు పోతుంటే దారికాసిన దుండగులు ఆయనను కత్తులతో పొడిచి చంపేస్తారు. దీనికి చిన్నవాడైన మారన్ ప్రత్యక్షసాక్షి. తల్లి హాస్పిటల్‌లో ఒక పాపను కని చనిపోతుంది. మేనమామ (నరేన్)తో కలిసి ఆ పాపను తనే పెంచుతూ వస్తాడు మారన్.
చనిపోకముందు నిజాయితీతో బతకమనీ, అదే సమయంలో చురుకుగా వ్యవహరించమనీ తండ్రి చెప్పిన మాటల్ని గుర్తుంచుకున్న మారన్.. ఆయన తరహాలోనే జర్నలిస్ట్ అవుతాడు. అక్కడ పనిచేసే తార (మాళవికా మోహనన్)తో పరిచయం స్నేహంగా మారుతుంది. ఒక ఎమ్మెల్యే (సముద్రకని)కు సంబంధించిన స్కామ్‌ను బయటపెట్టడంతో మారన్‌పై అతను కక్ష కడతాడు. అతడి చెల్లెల్ని కిడ్నాప్ చేయించి, ఆమెను సజీవ దహనం చేయిస్తాడు. దీంతో కర్తవ్యాన్ని మరచి, తాగుడుకు బానిసవుతాడు మారన్. ఆ తర్వాత ఏం జరిగింది? మారన్ చెల్లెలు కిడ్నాప్, హత్య వెనుక దాగిన అసలు రహస్యమేంటి? అనే విషయాలు మిగతా సినిమాలో తెలుస్తాయి.
విశ్లేషణ
కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చూశాక.. ధనుష్‌కు ఈ సబ్జెక్ట్ ఎలా నచ్చిందని మనకే తెగ ఆశ్చర్యం కలుగుతుంది. కథ నడిచే తీరు, మారన్ క్యారెక్టరైజేషన్‌కు తీవ్రంగా డిజప్పాయింట్ అవుతాం. చెల్లెలు హత్యకు గురైతే, దాని వెనుక నిజం తెలుసుకోకుండా, హంతకుల్ని పట్టుకోకుండా పిచ్చివాడి తరహాలో తాగుడుకు బానిసవడం ఏమిటి? హీరోయిన్ క్లాస్ తీసుకుంటే తప్ప కర్తవ్యం గుర్తుకు రాకపోవడం ఏమిటి? ఇలాంటి బ్యాడ్ క్యారెక్టరైజేషన్ వల్ల ధనుష్ క్యారెక్టర్‌తో మనం కనెక్ట్ కాలేం. పసిగుడ్డు అయిన చెల్లెల్ని చిన్నతనంలో మారన్ చేతుల్లోకి తీసుకొనే సీన్ చూసి డైరెక్టర్ భలే ఎమోషనల్‌గా తీశాడనుకున్న మనం.. పెరిగి పెద్దయ్యాక ఆ ఇద్దరూ ఎప్పుడూ పోట్లాడుకుంటూ, కొట్టుకుంటూ ఉండటం చూసి, ఇదేం క్యారెక్టరైజేషన్స్‌రా బాబూ అని తలలు పట్టుకుంటాం. మధ్యమధ్యలో చెల్లెలంటే అన్నకు ప్రాణం కదా అనే విషయం గుర్తుకొచ్చినట్లు కూడా మారన్ ప్రవర్తిస్తుంటాడనుకోండి!
మారన్ చెల్లెలి సజీవ దహనం వెనుక రహస్యం తెలిశాక డైరెక్టర్ ఇంకో కథ చెప్పాడు. పార్తీపన్ అనే ఆ క్యారెక్టర్ తన కథ చెప్తుంటే తల గోక్కోకుండా ఉండలేం. హీరోను ప్రేమించే తార క్యారెక్టరైజేషన్ అంతుపట్టదు. ఎప్పుడు చూసినా చీక్లెట్ నములుతూ కనిపిస్తుంది. టీవీ చానల్‌లో ఆమె చేసే పనేమిటో మనకు తెలీదు. విలన్ సముద్రకని క్యారెక్టర్‌ను కూడా బలంగా మలచడంలో డైరెక్టర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మారన్ మేనమామ క్యారెక్టర్‌తో పోలీసులు గేమ్ ఆడించే సీన్లు అబ్సర్డ్‌గా తోస్తాయి. జి.వి. ప్రకాశ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఓకేనే. ఎడిటింగ్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు. యాక్షన్ సీన్లు యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాయి.
నటీనటుల పనితీరు
మారన్‌గా ధనుష్ ఎంత బాగా చేసినా ఆ క్యారెక్టర్ తీరువల్ల అదంతా వృథాయే అయ్యింది. యాక్షన్ సీన్లలో అతను ఆకట్టుకున్నాడు. మాళవికా మోహనన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి క్యారెక్టర్ ఆమె ఎందుకు ఒప్పుకుందో! ఆమె కంటే మారన్ చెల్లిగా నటించిన స్మృతి వెంకట్ చాలా బెటర్. సముద్రకని, జయప్రకాశ్ లాంటివాళ్లకు వాళ్ల సామర్థ్యాలకు తగ్గ పాత్రలు లభించలేదు. ఆడుకాలమ్ నరేన్ పాత్ర ఎక్కువగా బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపించినా, కొన్ని సీన్లలో బాగానే ఉన్నాడు. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణకుమార్‌కు పెద్ద పాత్రే ఇచ్చారు. పాత్రపరిధి మేరకు నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మనకు తెలిసిన మహేంద్రన్ ఎస్సైగా కనిపించాడు. మారన్ తండ్రిగా రాంకీ గెస్ట్ క్యారెక్టర్‌లో రాణించాడు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
నాసిరకం కథనం, నాసిరకం క్యారెక్టరైజేషన్స్, నాసిరకం డైరెక్షన్‌తో 'మారన్' మనల్ని తీవ్రంగా నిరాశపరుస్తాడు. ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయడం కష్టమే.
రేటింగ్: 2/5
- బుద్ధి యజ్ఞమూర్తి
