English | Telugu

బాధ్య‌త మ‌ర్చిపోయిన‌ స్టార్‌ హీరోలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎప్పుడూ లేనంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌, జ‌య‌సుధ ఢీ అంటే ఢీ అంటూ త‌ల‌ప‌డ్డారు. ప‌రిశ్ర‌మ రెండు వ‌ర్గాలుగా విడిపోయి - స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు విసురుకొన్నారు. ప్రెస్ మీట్లు పెట్టుకొన్నారు, తిట్టుకొన్నారు, క‌వ్వించుకొన్నారు. మొత్తానికి సాధార‌ణ ఎన్నిక‌ల స్థాయిలోనే 'మా' ఎన్నిక‌లు అసాధార‌ణంగా జ‌రిగాయి. అయితే.. ఓటింగ్‌కి మాత్రం స్టార్ హీరోలు దూరంగా ఉండ‌డం విస్మ‌య‌ప‌రిచింది. ఒక్క నంద‌మూరి బాల‌కృష్ణ మిన‌హా అగ్ర క‌థానాయ‌కులు ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోలేదు. 'మా' వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన చిరంజీవి, ఆ ప‌ద‌విని ఓసారి అలంక‌రించిన నాగార్జున ఓటు వేయ‌డానికి ముందుకు రాలేదు. వెంక‌టేష్ కి 'మా 'కంటే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఎక్కువ‌య్యిందేమో. ఆయ‌నా బ‌య‌ట‌కు రాలేదు. యువ హీరోలెక్క‌డా అస‌లు ఈ ప్రాంగ‌ణంలోనే క‌నిపించ‌లేదు. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌, రానా.... జాడ లేదు. అస‌లు వీళ్లంతా 'మా' స‌భ్యులేనా అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించారు. 'మా' స‌ర్వ‌స‌భ్య స‌మావేశాలకు వీళ్లెప్పుడూ హాజ‌ర‌వ్వ‌రు. క‌నీసం ఇలాంటి కీల‌క‌మైన త‌రుణంలో అయినా ముందుకొచ్చి త‌మ మ‌ద్ద‌తు తెలియ‌ప‌ర్చ‌వ‌చ్చుగా? ఇండ్ర‌స్ట్రీలో గ్రూపు రాజ‌కీయాలకు ప్ర‌సిద్ది అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇవి 'మా' ఎన్నిక‌ల్లో మ‌రింత క్లియ‌ర్ గా బ‌య‌ట‌ప‌డిపోయాయి. ఓ వ‌ర్గం అధికారాన్ని త‌మ గుప్పెట్లోనే ఉంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. ఇలాంటి ద‌శ‌లో అయినా.. హీరోలు ముందుకు రావాల్సింది. న్యాయం త‌ర‌పున నిల‌బ‌డాల్సింది. కానీ మ‌నోళ్ల‌కు అంత శ్ర‌ద్ద ఎక్క‌డిది?? అదే స్టార్ క్రికెట్ మ్యాచ్ అనండి.. బ్యాట్లు ప‌ట్టుకొని వ‌చ్చేస్తారు, పార్టీల‌కు పిల‌వ‌డండి.. సూట్లు వేసుకొని వ‌చ్చేస్తారు. కానీ ఓట్ల‌కు మాత్రం క‌ద‌ల‌రు. వీళ్లు మార‌రంతే..!