English | Telugu
ఏమి చేతురా ‘లింగా’
Updated : Dec 11, 2014
రజనీకాంత్ సినిమా ‘లింగా’కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ సినిమా మొదలెట్టినప్పట్నించీ ఏదో ఒక కిరికిరి. ‘లింగా’ సినిమాని కొట్టేసిన కథతో రూపొందిస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. అప్పుడెప్పుడో తమిళంలో రూపొందిన ఒక సినిమా కథని అటూ ఇటూ తిప్పి ‘లింగా’ని రూపొందిస్తున్నారని తమిళ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత సినిమా సదరు కథా రచయిత రవిరత్నం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ సినిమాని తామెంతో చెమటోడ్చి తయారు చేసిన సొంత కథతోనే తీస్తున్నామని, కోర్టులో కేసు నిలబడదని సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కథానాయకుడు రజనీకాంత్ కూడా చెప్పారు. అయితే మనం ఒకటి తలిస్తే కోర్టు ఒకటి తలచిందన్నట్టుగా, ఈ సినిమా విడుదలకు రెడీ అయిన టైమ్‌లో కోర్టు షాకిచ్చింది. ఈ కేసు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం లోపు కోర్టుకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశింది. శుక్రవారే ప్రపంచవ్యాప్తంగా ‘లింగా’ విడుదలవుతోంది. ‘లింగా’ విడుదలైన తర్వాత ఇది కాపీ కథతో తీసిన సినిమా అని తేలితే ఆ పది కోట్లూ ఆటోమేటిగ్గా రైటర్‌కి వెళ్ళిపోతాయి. శుక్రవారం సినిమా విడుదల అనగా కోర్టు ఇలా ఆదేశించడంతో నిర్మాత కిక్కురుమనకుండా ఏమి చేతురా లింగా అనుకుంటూ పదికోట్లు కోర్టులో డిపాజిట్ చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయినా కాపీ కథతో తీసి కక్కూర్తి పడేబదులు ఆ రైటర్ మొహాన ముందే ఓ కోటో రెండు కోట్లో పడేస్తే ఇప్పుడు పది కోట్లకి బ్యాండు పడేది కాదు కదా... ఏంటో.. ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతే!