English | Telugu
తెలుగులో మరో రొమాంటిక్ సినిమా
Updated : Jan 27, 2016
కళాత్మక చిత్రం అంటే అర్థం మారిపోయిందిప్పుడు. పడగ్గది వ్యవహారాలు సైతం కెమెరాలో బంధించి.. దానికి ముందూ వెనుక ఎమోషనల్ సీన్లు జోడించి... రసవత్తరమైన సందేశం ఇవ్వడమే ఆర్ట్ సినిమా అనే భావనలో ఉన్నారు కొంతమంది దర్శకులు. యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్న లజ్జ సినిమా ట్రైలర్ చూసినా అదే అనిపిస్తోంది. ఇది మసాలాతో నిండిన సందేశాత్మక సినిమా...అని అర్థమైపోతోంది. 1940 ఓ గ్రామం సినిమాతో జాతీయ అవార్డు పొందిన నరసింహ నంది తీసిన రెండో సినిమాఇది. చలం భావాల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా రూపొందించా అంటున్నాడు దర్శకుడు.
భర్తతో ఏమాత్రం సుఖపడని భార్య తన మాజీ ప్రియుడి పంచన చేరి కోరికల్ని తీర్చుకోవడం అన్న పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ అంశాన్నే కాస్త పోయెటిక్ గా తెరకెక్కించాలన్న ప్రయత్నం చేశాడు దర్శకుడు. `నా సినిమాలకు అవార్డులతో పాటు డబ్బులు కూడా రావాలనే ఈ సినిమా తీశా` అని నిర్మొహమాటంగా చెబుతున్న నరసింహా నంది.. ఈ సినిమాలో కావల్సినన్ని మసాలా సన్నివేశాలు పొందుపరిచాడన్న విషయం ప్రచార చిత్రంలోనే తెలిసిపోతోంది. మధుమిత హాట్ హాట్ అందాలతో గాలం వేయడానికి తన దగ్గర అస్త్రాలన్నీ సిద్ధం చేసుకొన్నాడు. కామం - స్నేహం - ప్రేమ ఈ పాయింట్‌తో సినిమా తీసినా... దృశ్యాల్లో మాత్రం విచ్చలవిడితనం కనిపిస్తోంది. వీటికి ఈ `జాతీయ అవార్డు గ్రహీత` ఏం సమాధానం చెబుతాడో, సెన్సార్ ని దాటుకొని ఎలా బయటకు వస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.