Read more!

English | Telugu

‘మంచోడన్న సెడ్డ పేరు నాకొద్దు’ అంటున్న మాస్‌ కా దాస్‌!

విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి జంటగా శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. అంజలి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. 

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయి రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 17న సినిమాను రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. అందులో భాగంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ ఆద్యంతం ఆకట్టుకుంది. లంకల రత్నగా విశ్వక్‌ ఈ సినిమానలో ఊర మాస్‌ అవతార్‌ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటుందని టీజర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ‘ఒక్కసారి లంకలో కత్తి కట్టారూ అంటే ఆ మనిషిని సంపకుండా వదల్రు’ అంటూ సాయికుమార్‌ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఆ తర్వాత ‘ఆడి సొంత మనుషులే వాడిమీద కత్తి కడుతున్నాంట్ర’ అని ఒకరు, ‘ఆడి విషయంలో ఊరంతా ఒక్కటై పోయింది.. ఇంక వాడ్ని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి’ అంటూ మరొకరి వాయిస్‌ వినిపిస్తుంది. ఒక పాత బిల్డింగ్‌లో ఉన్న హీరోపై ఒక్కసారిగా దాడి చేస్తారు ఊరి జనం. ఆ జనాన్ని చూసిన హీరో ‘అమ్మోరు పూనేసింద్రా.. ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే..’ అంటూ ఒక్కర్నీ నరకడం మొదలు పెడతాడు. ‘నేను మంచోడ్నో.. సెడ్డోన్నో నాకు తెలీదు.. కానీ, మంచోడన్న సెడ్డ పేరు మాత్రం నాకొద్దు’ అంటూ విశ్వక్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. 

లంకల రత్నకి, ఊరి జనానికి ఉన్న సమస్య ఏమిటి? ఇంతకీ హీరో మంచివాడా, చెడ్డవాడా, ఊరు ఊరంతా అతన్ని ఎందుకు వెంటాడుతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మే 17న దొరుకుతుంది. సినిమా మేకింగ్‌గానీ, మ్యూజిక్‌గానీ అద్భుతంగా ఉన్నాయి. యువన్‌శంకర్‌రాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. మాస్‌ కా దాస్‌ నుంచి వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.