English | Telugu

కంప్లీట్ రివ్యూ : ఈడోర‌కం - ఆడోర‌కం

ప్రేక్ష‌కులు అల్ప సంతోషులు. బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైపోయే సినిమాలేం కోరుకోరు! సినిమాకెళ్తే.. బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోవాలంతే. వాళ్ల‌కు వంద కోట్ల సినిమాలు, వంద రోజుల సినిమాలూ అక్క‌ర్లెద్దు. ' వంద రూపాయ‌లు పెట్టి టికెట్ ఎందుకొన్నాం రా బాబు ' అంటూ వంద‌సార్లు ఆలోచించ‌కుండా చేస్తే చాలు. అంటే కాసేపు నవ్వించాలి.. కొంత కాల‌క్షేపం ఇవ్వాలి. స్ర్కిప్టు రాసుకొనేట‌ప్పుడు ఈ ముక్కొక్క‌టీ గుర్తు పెట్టుకొంటే చాలు.. `ఈడోరకం - ఆడోర‌కం` లాంటి సినిమాలొస్తూ ఉంటాయి. ఊపోద్ఘాతాలు చూసి ఇదేదో సూప‌ర్ డూప‌ర్ హిట్‌.. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అనుకోవొద్దు. జ‌స్ట్ టైమ్ పాస్ అంతే! మ‌న‌క్కావాల్సిందీ ఆ కాల‌క్షేప‌మే కాబ‌ట్టి నిర‌భ్యంత‌రంగా వెళ్లొచ్చు. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది?? ఏమా క‌థ‌? తెలుసుకొందాం.. రండి.

కథ :

అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్ (రాజ్ త‌రుణ్‌) ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఇద్ద‌రూ ఆవారాలే. అర్జున్ కండ బ‌లం ఉపయోగిస్తే, అశ్విన్ బుద్దిబ‌లం ఉప‌యోగిస్తాడు. ఓ పెళ్లిలో అర్జున్... నీల‌వేణి (సోనారిక‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే `నాక్కాబోయేవాడు ఓ అనాథ కావాలి` అనుకోరుకొంటుంది నీల‌వేణి. అందుకే త‌న‌కో కుటుంబం ఉన్నా.. స‌రే అనాథ అని అబ‌ద్ధ‌మాడ‌తాడు. నీల‌వేణి అన్న‌య్య (అభిమన్యుసింగ్‌) ఓ దాదా. నీల‌వేణి ప్రేమ సంగ‌తి తెలిసి అప్ప‌టిక‌ప్పుడు అర్జున్ తో పెళ్లి జ‌రిపిస్తాడు. అయితే విధివ‌శాత్తూ అర్జున్ ఇంట్లోనే నీల‌వేణి అద్దెకు దిగుతుంది. అంటే అర్జున్‌కు త‌న ఇంట్లోనే తాను అనాథ‌లా నాట‌కం ఆడాల్సివ‌స్తుంద‌న్న‌మాట‌. అక్క‌డి నుంచి అర్జున్‌కి క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. దాంతో అర్జున్ ఓ ప్లాన్ వేస్తాడు. త‌న స్నేహితుడు అశ్విన్‌ని.. నీల‌వేణి భ‌ర్త‌గా త‌న ఇంట్లోవాళ్ల‌ని న‌మ్మిస్తాడు. ఆ ఒక్క త‌ప్పుతో.. అర్జున్ జీవితం గంద‌ర‌గోళంలో ప‌డుతుంది. ఈ క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామా ఎక్క‌డి వ‌ర‌కూ న‌డిచింది? చివ‌రికి ఏమైంది?? అన్న‌దే.. క‌థ‌.

ఇన్ డెప్త్ :

పంజాబీలో విజ‌య‌వంత‌మైన ఓ చిత్రానికి రీమేక్ ఇది. కొన్ని కొన్ని మార్పుల‌తో.. తెలుగులో న‌డిపించేశారు. క‌థ‌లో కావ‌ల్సినంత క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది. ఆ క‌న్‌ఫ్యూజన్ నుంచి కామెడీ పుట్టించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అర్జున్ ఎవ‌రికి భ‌ర్త‌? అశ్విన్ పెళ్లాం ఎవ‌రు? నీల‌వేణి - అశ్విన్‌ల‌కున్న సంబంధం ఏమిటి?? ఇవ‌న్నీ క‌న్‌ఫ్యూజ‌న్ క‌లిగించేవే. వాటి మ‌ధ్య కావ‌ల్సినంత వినోదం పుట్టించాడు. ఆసీన్ల‌న్నీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డం వ‌ల్ల‌... హిలేరియ‌స్‌గా అనిపిస్తాయి. ఒక ఇంట్లో ఉన్న రెండు జంట‌లు.. కుండ‌మార్పిడిలా భ‌ర్త‌లు భార్య‌ల్ని, భార్య‌లు భ‌ర్త‌ల్నీ మార్చుకొంటుంటారు. దాంతో మిగిలిన పాత్ర‌లు క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డుతుంటాయి. సినిమా అంతే ఇదే హంగామా! హంగామా అంటే గుర్తొచ్చింది, ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన హంగామా కాన్సెప్ట్ కూడా దాదాపుగా ఇదే. అయితే... ఆ క‌న్‌ఫ్యూజ‌న్ సెకండాఫ్‌కి ప‌రిమిత‌మైతే.. ఇక్క‌డ మాత్రం సినిమా అంతా అదే. విష్ణు, రాజ్ త‌రుణ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ర‌విబాబుల మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాలు.. స‌ర‌దాగా సాగిపోతాయి. రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌తీసారీ గంద‌ర‌గోళంలో ప‌డ‌డం.. చివ‌రికి తానే బ‌క‌రా కావ‌వ‌డం - సినిమా అంతా ఇదే కంటిన్యూ అయినా, అందులో ఫ‌న్ బాగా పండింది. అయితే చాలాచోట్ల బూతులు బాగా వినిపించాయి. `సెల్ లో ఛార్జింగ్ లేని ఫోను` అంటూ ఓ చోట‌.. డ్రైవింగ్‌కీ ఫ‌స్ట్ నైట్‌కీ లింకులు పెట్టి మ‌రోచోట‌.. డ‌బుల్ మీనింగ్ డైలాగులు వినిపించారు. వినోదాత్మ‌క చిత్రాలు చూడ్డం ఇష్ట‌ప‌డే కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అవి పంటి కింద రాయిలానే త‌గులుతాయి. ప్ర‌ధమార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థం స్పీడుగా ఉండాలి. కానీ... అక్క‌డ‌క్క‌డ సినిమా డ‌ల్ అయ్యింది. క్లైమాక్స్ కూడా చుట్టేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. విష్ణు ప‌ర్స‌నాలిటీని వాడుకోవ‌డానికి త‌ప్ప‌.. క్లైమాక్స్ ఫైటుకు అర్థం లేదు. వాటిని కాస్త క్ష‌మించేస్తే ఈడూ, ఆడూ టైమ్ పాస్ ఇచ్చేస్తారు.

పెర్ఫామెన్స్ :

విష్ణు, రాజ్ త‌రుణ్ వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇద్ద‌రూ క‌ష్ట‌ప‌డ‌లేదు.. ఇష్టంగా చేసేశారు. రాజ్ త‌రుణ్ మైలేజీ ఈ సినిమాకి ప్ల‌స్సు. ఇక క‌థానాయిక‌లు సోనారిక‌, హెబ్బా ప‌టేల్‌.. అందాల ఆర‌బోత‌లో పోటీ ప‌డ్డారు. ఎక్స్‌పోజింగ్ వద్ద‌న్నా విచ్చ‌ల‌విడిగా చేసేశారు. హెబ్బా అయితే ఓ స‌న్నివేశంలో త‌న కొల‌త‌లు కూడా చెప్పేస్తుంది. మ‌సాలా పాత్ర‌ల‌కు ఇద్ద‌రూ ప‌ర్‌ఫెక్ట్ అని మ‌రోసారి నిరూపించారు. రాజేంద్ర ప్ర‌సాద్‌కి మంచి పాత్రే ప‌డింది. త‌న అనుభ‌వం కొద్దీ.. న‌ల్లేరు మీద న‌డ‌క‌లా ఆ పాత్ర‌ని లాక్కెళ్లిపోయారు. చాలాకాలం త‌ర‌వాత రవిబాబు న‌ట‌న చూడ‌గ‌లిగాం.

టెక్నికల్ గా :

సాంకేతికంగా సినిమా రిచ్ గా ఉంది. ఫొటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా అనిపించింది. ఉన్న‌వి నాలుగు పాట‌లే. ఆవీ.. ఫాస్ట్ బీట్‌లు. థియేట‌ర్లో కాల‌క్షేపం అయిపోతాయి. రీమేక్ సినిమా అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తీయ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు. అయితే బూతుల డోసు త‌గ్గించుకొంటే బాగుండేది. మొత్తానికి టైమ్ పాస్ అయిపోతే చాలు అనుకొన్న‌వాళ్ల‌కు ఈ సినిమా న‌చ్చుతుంది. ఢీ అంత కాక‌పోయినా.. విష్ణు కెరీర్‌కి ఈ సినిమా ఎంతో కొంత హెల్ప్ అవ్వ‌డం ఖాయం.

తెలుగు వన్ రేటింగ్‌ : 2.75/5

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.