English | Telugu
దిక్కులు చూడకు రామయ్యా రివ్యూ
Updated : Oct 10, 2014
ప్రేమ... ఈ సబ్జెక్ట్ ఓ అక్షయపాత్ర. ఎన్ని కథలు రాసుకొన్నా... ఏదో ఓ కోణం మిగిలిపోయే ఉంటుంది. పాత కథనే కొత్తగా కోటింగ్ ఇచ్చి తీసినా, చూసి తరించిపోవడానికి ప్రేక్షకులు కూడా సదా సిద్ధంగానే ఉంటారు. కానీ ఆడియన్స్‌ని కన్వెన్స్ చేసే స్థాయి ఆ కథకి, అందులోంచి పుట్టుకొచ్చే సన్నివేశాలకు ఉండాలి. ముక్కోణపు ప్రేమకథలకు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టే దమ్ము ఉంటుంది. కాకపోతే అదీ పాత వాసన కొట్టేస్తోంది. ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయి.. ఇలాంటి ప్రేమ కథలు చూసి విసిగిపోయాం. కానీ వెదికితే అందులోనూ ఓ కొత్తపాయింట్ మిగిలే ఉంది. దాన్ని పట్టుకొన్న సినిమా.... దిక్కులు చూడకు రామయ్యా. తండ్రీ కొడుకులు కలసి ఓ అమ్మాయినే ప్రేమిస్తే... అన్నదే ఆ కొత్త పాయింట్. ఇదేం పైత్యమండీ బాబూ.. అలా ఎలా కుదురుతుంది?? అంటారా..? కానీ ఈ సినిమాలో కుదిరింది. అదెలాగంటే...
గోపాల కృష్ణ (అజయ్) ఓ బ్యాంక్ ఉద్యోగి. ఇద్దరు కొడుకులున్నారు. ఒకడు మధు (నాగశౌర్య). ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయినా సరే... గోపాల కృష్ణలో రొమాంటిక్ యాంగిల్ ఇంకా మిగిలే ఉంది. దానికి కారణం.. చిన్న వయసులోనే గోపాల కృష్ణ పెళ్లయిపోయి, బాధ్యతలు నెత్తిమీద పడ్డాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కల తీరలేదు. ప్రేమ రుచి పూర్తిగా అనుభవించలేదు. అందుకే... చిలిపి పనులు చేస్తుంటాడు. బ్యాంక్‌లోన్ విషయమై సంహిత (సన మక్బుల్) పరిచయమవుతుంది. ఆమెకు ఎవ్వరూ లేరు. లోన్ ని అడ్డుపెట్టుకొని సంహితకు దగ్గరవుదామని చూస్తాడు గోపాల కృష్ణ. అదే సమయంలో మధు కూడా సంహితను ఇష్టపడతాడు. తన ప్రేమ విషయం సంహితకు చెప్పేలోగా.. నాన్న కూడా సంహితనే ఇష్టపడుతున్నాడన్న విషయం తెలుస్తుంది. దాంతో షాక్‌కి గురవుతాడు. అమ్మ (ఇంద్రజ) ఏమైపోతుందో అన్న భయం పట్టుకొంటుంది. ప్రేమ పేరుతో దాంతో దారి తప్పిన నాన్నకు బాధ్యతల్ని గుర్తుకు తెద్దామని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలమయ్యింది? గోపాల కృష్ణలో మార్పు ఎలా వచ్చింది అనేదే ఈ సినిమా కథ.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఇదో కొత్త పొర. ఇదే కథని బూతు సినిమాలు బ్రహ్మాండంగా తీసి పారేసే దర్శకుడి చేతిలో పెడితే.. నానా చెండాలం జోడించి.. యూత్‌ని థియేటర్లకు రప్పించి సొమ్ములు చేసుకొనేవాడు. కానీ... కొత్త దర్శకుడు త్రికోఠి ఈ కథని పద్ధతిగా తీసే ప్రయత్నం చేశాడు. అందుకు అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. తండ్రీ కొడుకులు ఓ అమ్మాయిని ప్రేమించడం అనే పాయింట్.. తెలుగు ప్రేక్షకులకు జీర్ణం అవ్వనిదే. అయితే అన్నం ముద్ద బాగా కలిపి, దానికి నెయ్యి రాసి, పప్పు కలిపి.. గోరు ముద్దలుగా అందించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయాణంలో దర్శకుడు నమ్ముకొన్నది వినోదాన్నే. అందుకే గోపాల కృష్ణుడి లీలలు చూపిస్తూ, మధ్య తరగతి భర్తల అలవాట్లూ, బయట చేసే అరాచకాలూ వర్ణిస్తూ.. మధ్యలో కుర్రాడి లవ్ స్టోరీని లింక్ చేస్తూ.. కథని నడిపేశాడు. అమ్మాయిని పడేయడానికి గోపాలకృష్ణ వేసే వేషాలూ, చేసే కసరత్తులు సరదాగా సాగిపోతాయి. బ్రహ్మాండం అనలేం గానీ, టైమ్ పాస్‌కి కొదవ ఉండదు. ఇంట్రవెల్ వరకూ కథ ఇలానే నడిచింది.
అయితే ఆ తరవాత దర్శకుడికి చెప్పడానికి ఏం మిగల్లేదు. దాంతో కథ ఓ చోటే గిరి గీసుకొని దాంట్లో సర్కస్ చేస్తుంటుంది. చూసిన సీన్ మళ్లీ తెరపైకి వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇందులో రెండు ప్రేమ కథలున్నాయి. ఒకటి అజయ్- హీరోయిన్‌ది, రెండోది నాగశౌర్య - హీరోయిన్‌ది. కాకపోతే దర్శకుడు అజయ్ ప్రేమకథపైనే ఫోకస్ పెట్టాడు. దాంతో నాగశౌర్య సపోర్టింగ్ పాత్ర అయిపోయింది. మొదటి సగం హుషారుగా సాగిపోతే.. ద్వితీయార్థం బోర్ కొట్టిస్తుంది. సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసినా అనవసరపు సన్నివేశాలతో ఇంకా ఏదో చూపించాలన్న తపనతో కథని పొడిగించుకొంటూ వెళ్లిపోయాడు. అయితే చివర్లో పతాక సన్నివేశాలు మళ్లీ ఈసినిమాని కాస్త నిలబెట్టాయి. దాంతో.. మరీ నిరాశ పడకుండా థియేటర్ల నుంచి జనం బయటకు వస్తారు.
ఈ సినిమాకి ప్రాణం.. అజయ్. అతనిలో ఇలాంటి నటుడూ ఉన్నాడా?? అనిపిస్తుంది. గోపాలకృష్ణ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పైగా అది అజయ్ వయసుకి తగిన పాత్ర. ఎమోషన్ సీన్స్‌లో మాత్రం కాస్త వెనకబడ్డాడు. పతాక సన్నివేశాల్లో ఆ లోపం తెలుస్తుంది. ఇక నాగశౌర్య కూడా మంచి మార్కులు కొట్టేస్తాడు. హీరోయిజం చూపించే సినిమా కాదిది. తన వంతుగా ఈ సినిమాని లాగే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నటన వరకూ ఓకే. కానీ... మరో అందమైన కథానాయికని ఎంచుకొంటే బాగుండేదనిపిస్తుంది. ఇంద్రజ ద్వారా ఓ సహాయనటి దొరికనట్టైంది. ఇలాంటి పాత్రలు ఆమెకు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. అలీ.. నవ్వులు పండించలేకపోయాడు. చివర్లో వచ్చిన పోసాని కూడా డిటోనే.
సాంకేతికంగా చూస్తే కీరవాణి సంగీతానికి మంచి మార్కులు పడతాయి. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం. ఇంట్రవెల్ బ్యాంగ్‌లో కీరవాణి అనుభవం బయటపడింది. నిజానికి ఇంట్రవెల్ సన్నివేశంలో అంత సంక్లిష్టత లేదు. బ్యాంగ్ కి అనువైన సీన్ కూడా కాదది. కానీ.. తన ఆర్.ఆర్‌తో అమాంత లేపాడు. మధ్య మధ్యలో కొన్ని బిట్స్ వాడుకోవడం కూడా బాగుంది. మాటలు అక్కడక్కడా పండాయి. కానీ అందులో డెప్త్ తక్కువైంది. త్రికోఠి కొన్ని విషయాల్లో తన శైలి చూపించే ప్రయత్నం చేశాడు. సీన్స్ రాసుకోవడంలో ఇంకా అనుభవం రావాలి. కథ ఒకే చోట తిప్పడం వల్ల.. తడబడ్డాడేమో అనిపించింది. ఏడుపులూ, పెడబొబ్బలూ, భారీ సెంటిమెంట్ డైలాగులూ లేకుండా కథని నడపడం మాత్రం బాగుంది.
ప్రేమ కథంటే ఈతరానికి బూతే. అందులోనూ బూతుని కావల్సినంత జొప్పించే అవకాశం ఉన్న కథ ఇది. ఆ జోలికి పోలేదు త్రికోఠి. వెతికితే పాత ప్రేమకథల్లోనూ ఓ కొత్త పాయింట్ దొరుకుతుందని ఈ సినిమా నిరూపించింది. ట్రీట్‌మెంట్ విషయంలో చేసిన లోపాల వల్ల ఓ మాదిరి సినిమాగా మిలిగింది. లేదంటే... దిక్కులు చూడకుండా నేరుగా హిట్ కొట్టేసేది. లోపాలున్నాయి కాబట్టి, బిక్కు బిక్కుమంటూ యావరేజ్ స్థాయికి అందుకోవచ్చు.
పంచ్ లైన్ : దిక్కులు చూడకు రామయ్యా ..చిక్కులు తక్కువే రామయ్యా
రేటింగ్ 2.5