English | Telugu

మంచు ల‌క్ష్మిపై సెటైర్లు వేస్తున్నాడా..??

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో మ‌స్త్ పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్ ద‌న్‌రాజ్‌. బుల్లి తెర‌పై ఈ బ‌క్క‌ప‌ల్చ‌ని హాస్య‌న‌టుడు.... బ‌డా హీరో అయిపోయాడు. జ‌బ‌ర్‌ద‌స్త్ పోగ్రాంతో ఒక్క‌సారిగా ఇంటింటి స్టార్ అయ్యాడు. ఆత‌ర‌వాత వెండి తెర అవ‌కాశాలు వ‌రుస‌క‌ట్టాయి. మంచు ల‌క్ష్మితో క‌ల‌సి `పిల‌వ‌ని పేరంటం` అంటూ ఓ సినిమా మొద‌లైంది. `ఈ సినిమాలో నేనే హీరో..` అన్న పాపానికి మంచు ల‌క్ష్మి ఆగ్ర‌హానికి గురై ఆ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఓపెనింగ్ రోజున జ‌రిగిన ప్రెస్ మీట్లో `ల‌క్ష్మి ప‌క్క‌న హీరోగా న‌టిస్తున్నా..` అని పొర‌పాటున నోరుజారిన ఈ క‌మెడియ‌న్ ల‌క్ష్మి ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. `నా ప‌క్క‌న నువ్వు హీరో అని చెప్పుకొంటావా` అని మంచు ల‌క్ష్మి క‌స్సున లేచింద‌ట‌. దాంతో ధ‌న్‌రాజ్‌కి వాకౌట్ త‌ప్పలేదు. ఇప్పుడు మంచు ల‌క్ష్మి సినిమా పిల‌వ‌ని పేరంటంకి పోటీగా ధ‌న్‌రాజ్ మ‌రో సినిమా మొద‌లెట్టాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఆ సినిమాకి ధ‌న‌ల‌క్ష్మి త‌లుపు త‌డితే అనే పేరు ఖ‌రారు చేశార‌ట‌. ఈ సినిమాలో మంచు ల‌క్ష్మిపై కొన్ని సెటైర్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. అంతేకాదు.. పిల‌వ‌ని పేరంటం క‌థ‌కీ ధ‌న‌ల‌క్ష్మి త‌లుపు త‌డితే క‌థ‌కీ ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయ‌ట‌. పిల‌వ‌ని పేరంటం సినిమాపై సెటైర్లు వేస్తూ సాగే కామెడీ సినిమా అట‌. పొర‌పాటున నోరు జారి ప‌లికిన చిన్న మాట‌.. ఇప్పుడు ఓ సెటైరిక‌ల్ సినిమా తీసే స్థాయికి చేరింది. మ‌రి ధ‌ర్‌రాజ్ మంచు ల‌క్ష్మి.. మ‌ధ్య ఈ చిచ్చు ఎంత వ‌ర‌కూ సాగుతుందో తెలియాంటే కొన్ని రోజులు ఆగాలి.