English | Telugu
Blink Review: బ్లింక్ మూవీ రివ్యూ
Updated : Aug 24, 2024
మూవీ : బ్లింక్
నటీనటులు: దీక్షిత్ శెట్టి, చైత్ర జె. అచర్, గోపాలకృష్ణ దేశ్ పాండే, మందార బత్తలహళ్లి తదితరులు
ఎడిటింగ్: సంజీవ్ జాగిర్దార్
సినిమాటోగ్రఫీ: అవినాశ్ శాస్త్రి
మ్యూజిక్: ప్రసన్న కుమార్ ఎమ్ఎస్
నిర్మాతలు: రవిచంద్ర ఏజే
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనిధి బెంగళూరు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ మధ్యకాలంలో వచ్చిన టైమ్ ట్రావెల్ మూవీ ఆరంభం మూవీ తరహాలో.. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కన్నడలో రిలీజైన 'బ్లింక్' ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ :
అపూర్వ(దీక్షిత్ శెట్టి) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తన తండ్రి ఏమైపోయాడో తెలియదు. ఇక అతనికి థియేటర్ ఆర్ట్స్ అంటే ఇష్టం. అతనితో పాటుగా స్వప్న(మందార బత్తలహళ్లి) అనే అమ్మాయికి కూడా థియేటర్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండటంతో ఇద్దరు కలిసి నాటికలు కూడా వేస్తుంటారు. అలా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. అపూర్వకి ప్రతీ విషయంలోను స్వప్న సాయం చేస్తుంది. అయితే ఓ రోజున అపూర్వ లైఫ్ లోకి ఒకతను వస్తాడు. ' కళ్లార్పకుండా ఎక్కువ సేపు ఉండగలిగే అద్భుత శక్తి నీకు ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను గతంలోకి తీసుకెళ్తా' అని అపూర్వతో అతను చెప్తాడు. మొదట అతను నిరాకరించిన తన నాన్న ఏమయ్యాడో తెలుసుకోవడం కోసం అపూర్వ దానికి ఒప్పుకుంటాడు. మరి అపూర్వ తన నాన్నని చూశాడా? గతంలోకి వెళ్లిన అపూర్వకి ఎలాంటి నిజాలు తెలిశాయి? అపూర్వ గతంలో నుండి ప్రెజెంట్ కి ఎలా వచ్చాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
అపూర్వ అంటే అబ్బాయి పేరు. ఇది కన్నడ సినిమా కాబట్టి తెలుగులో అంతగా ప్రమోషన్స్ చేయలేదు. బట్ ఒక్కసారి చూస్తే కనెక్ట్ అయిపోతారు. కథ వస్తువు చిన్నదే అయిన స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజింగ్ సీన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కలిసి మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. బ్లింక్ అంటే రెప్పపాటు కాలం.
ఓ మనిషి గతంలోకి వెళ్ళి తనకేమైందో, తనవాళ్ళకేమైందో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ కాన్సెప్ట్ తో రీసెంట్ గా ' ఆరంభం ' అనే వెబ్ సిరీస్ వచ్చింది. అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే పంథాలో ఈ మూవీ వచ్చింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ బాగుంది. అయితే దర్శకుడు మెయిన్ పాయింట్ ఎత్తుకోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొదటి ఇరవై నిమిషాలు క్యారెక్టర్ల పరిచయానికి అయిపోయింది. ఇక అసలు కథలోకి వెళ్ళాక కథనం పరుగులు తీస్తుంది. హీరో తన నాన్న కోసం పడే తపన, నాన్నకి తనకి మధ్య జరిగే సీక్వెన్స్ ఎమోషనల్ గా ఉంటాయి. ముఖ్యంగా సెకెంఢాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుడికి బాగా గుర్తుండిపోతాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.
సినిమాలో చివరి అరగంట కీలకంగా మలిచాడు దర్శకుడు. కంటిరెప్ప వాల్చిన, పక్కకి తిరిగినా కథ మిస్ అయిపోతుంది. క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా గతానికి వెళ్ళిన హీరోకి ఏది డ్రీమ్, ఏది నిజం అని కనుక్కోవడం కత్తి మీద సాములా మారుతుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ పోతుంది అంతే. ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా కథని దర్శకుడు రాసుకున్నాడు.
అడల్ట్ సీన్లు ఏమీ లేవు. ఫ్యామిలీతో కలసి చూసేయొచ్చు. టైమ్ ట్రావెల్ కథలని ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ ఫీస్ట్ అవుతుంది. సంజీవ్ జాహిర్దార్ ఎడిటింగ్ బాగుంది. ప్రసన్న కుమార్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అవినాశ్ శాస్త్రి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అపూర్వ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. దేవకిగా చైత్ర, స్వప్నగా మందార బత్తలహళ్లి, గోపాలకృష్ణగా గోపాలకృష్ణ దేశ్ పాండే ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే టైమ్ ట్రావెల్ ఎంగేజింగ్ మూవీ.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
