English | Telugu

అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ

తారాగణం: సత్యదేవ్, ఆనంది, నాజర్, రఘుబాబు, కోట జయరాం, దిలీప్ తాహిర్, పూనమ్ బజ్వా, హర్ష్ రోషన్ తదితరులు
సంగీతం: విద్యాసాగర్
డీఓపీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: చాణక్య రెడ్డి
రచన: క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాస్ రావు
క్రియేటర్: క్రిష్ జాగర్లమూడి
డైరెక్టర్: వి.వి. సూర్య కుమార్
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: ఆగస్టు 8, 2025

హీరో, విలన్.. సినిమా, సిరీస్ వంటి లెక్కలు వేసుకోకుండా విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడు 'అరేబియా కడలి' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా దీనికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ కావడం విశేషం. మరి ఈ 'అరేబియా కడలి' సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Arabia Kadali Review)

కథ:
విశాఖపట్నంలోని భీమిలిపట్నం చుట్టూ ఈ క‌థ జ‌రుగుతుంది. మత్య్సవాడ, చేపలవాడ గ్రామాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు ఉంటాయి. అయితే ఈ రెండు గ్రామాలకు చెందిన బదిరి(సత్యదేవ్), గంగ(ఆనంది) ప్రేమలో ఉంటారు. పొరుగూరి అబ్బాయితో తన కూతురు గంగ ప్రేమలో ఉండటం చేపలవాడ నాయకుడు నానాజీ(కోట జయరామ్)కి నచ్చదు. మరోవైపు తీర ప్రాంత గ్రామాలు అయినప్పటికీ.. జెట్టీలు లేని కారణంగా మత్య్సవాడ, చేపలవాడకు చెందిన మత్స్యకారులు.. గుజరాత్ వలస వెళ్లి అక్కడ చేపల వేట చేస్తుంటారు. ఒకసారి బదిరి మరియు అతని అనుచరులు చేపలు వేటకు వెళ్లి.. అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అవుతారు. దీంతో వారిని పాక్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. బదిరి మరియు అతని బృందం పాకిస్తాన్ జలాల్లోకి ఎలా వెళ్లారు? అక్కడి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారిని వెనక్కి తీసుకురావడం కోసం భారత్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? బదిరి-గంగ ప్రేమ కథ ఏమైంది? వంటి విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ట్రైలర్ చూసినప్పుడే 'అరేబియా కడలి' కథ ఏంటో అవగాహన వస్తుంది. ఇది నిజంగా జరిగిన కథ. 2018 లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు మత్స్యకారులు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లగా, అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి అక్కడి అధికారులకు చిక్కారు. కుటుంబ సభ్యుల పోరాటం, ప్రభుత్వాల కృషితో పాక్ జైల్లో మగ్గుతున్న వారు క్షేమంగా భారత్ కు తిరిగొచ్చారు. ఈ కథ ఆధారంగా ఇప్పటికే 'తండేల్' అనే సినిమా వచ్చి, విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ అదే కథతో 'అరేబియా కడలి' సిరీస్ వచ్చింది. అదే ఈ సిరీస్ కి మైనస్ అని చెప్పవచ్చు. తండేల్ ని చూడని వాళ్ళకి లేదా ఆ సినిమాని మైండ్ లో పెట్టుకోకుండా చూసేవాళ్ళకి 'అరేబియా కడలి' నచ్చే అవకాశాలు ఉన్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా కథలు రాసుకున్నప్పటికీ.. సినిమాటిక్ లిబర్టీ పేరుతో కల్పిత సన్నివేశాలు రాసుకోవడం, కమర్షియల్ హంగులు జోడించడం ఎక్కువమంది చేసే పని. కానీ, 'అరేబియా కడలి' విషయంలో అలాంటి ప్రయత్నం పెద్దగా జరగలేదు. నిజాయితీగా కథ చెప్పడానికే ప్రయత్నించారు. అదే ఈ సిరీస్ ని ప్రత్యేకంగా నిలిపింది. ఇద్దరి మధ్య ప్రేమ కథను ఆవిష్కరించడం కంటే కూడా.. మానవ బంధాల విలువను తెలిపేలా సిరీస్ ను మలిచారు. తెలిసిన కథే అయినప్పటికీ, కథనాన్ని ఆసక్తికరంగా రాసుకున్నారు. రెండు గ్రామాల మధ్య వైరాన్ని, రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని సమాంతరంగా చూపిస్తూ.. కథను నడిపిన తీరు ఆకట్టుకుంది. అలాగే హీరో, హీరోయిన్ల పాత్రలను రాసుకున్న తీరు కూడా బాగుంది. తమ ప్రేమ కోసం, తమ స్వార్థం కోసం అన్నట్టుగా కాకుండా.. ప్రజల కోసం ఆలోచించి, వారి కోసం నిలబడే స్వభావం ఉన్నట్టుగా ఆ పాత్రలను తీర్చిదిద్దారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బదిరి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించాడు. గంగ పాత్రలో ఆనంది తన సహజ నటనతో ఆకట్టుకుంది. నాజర్, రఘుబాబు, కోట జయరాం, దిలీప్ తాహిర్, పూనమ్ బజ్వా, హర్ష్ రోషన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

'అరేబియా కడలి' సిరీస్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంది. విద్యాసాగర్ సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. రచన, దర్శకత్వ విభాగాల పనితీరు బాగుంది. రైటింగ్ పరంగానూ, విజువల్స్ పరంగానూ సహజత్వం ఉట్టిపడింది. చాణక్య రెడ్డి ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు మాత్రం తేలిపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా...
తెలిసిన కథే అయినప్పటికీ ఆసక్తికరమైన కథనంలో సహజత్వం ఉట్టిపడేలా 'అరేబియా కడలి' సిరీస్ ను మలిచిన తీరు బాగుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే భావోద్వేగ ప్రయాణాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది.

రేటింగ్: 2.75/5

Disclaimer: This review shares the opinions and views expressed by the writer and organisation doesn't hold any liability. Viewers' discretion is advised before reacting.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.