English | Telugu

నానికి ప్రాణం పోసిన ఆ ఇద్ద‌రు హీరోలూ..

చిన్న గీత‌ను పెద్ద గీత చేయాలంటే దాని పక్క‌న మ‌రింత చిన్న గీతను గీయాల్సిందే. సినిమా విష‌యాల్లోనూ అంతే. ఓ యావ‌రేజ్ ని హిట్ సినిమాగా మ‌ల‌చాలంటే ప‌క్క థియేట‌ర్లో ఫ్లాప్ సినిమా ప‌డాల్సిందే. గ‌త‌వారం నాని న‌టించిన రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. జెండాపైక‌పిరాజు సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోతే... ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సోసో గా అనిపించింది. ఈ రెండింటి వ‌సూళ్లు నానిని తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. వారం రోజులు గ‌డిచాక‌.. సుబ్ర‌హ్మ‌ణ్యం బాగా కోలుకొన్నాడు. వ‌సూళ్ల పండ‌గ చేసుకొంటున్నాడు. కార‌ణం.. రేయ్‌, జిల్ సినిమాలే. ఈ వారం ఈ రెండు చిత్రాలూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. రేయ్ డిజాస్ట‌ర్ లిస్టులో చేరితే - జిల్ ఓకే అనిపించాడు. అయితే రెండింటికీ వ‌సూళ్లు లేవు. దాంతో గ‌త‌వారం వ‌చ్చిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం హాళ్లు నిండ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. ఏ సెంట‌ర్ల‌లో నాని సినిమా బ‌లంగా పుంజుకొంది. దానికి కార‌ణం.. గోపీచంద్‌, సాయిధ‌ర‌మ్‌లే. అలా వీళ్లిద్ద‌రూ క‌ల‌సి అయిపోయింద‌నుకొన్న సినిమాని నిల‌బెట్టారన్న‌మాట‌. నాని వీళ్లిద్ద‌రికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.