English | Telugu
నాని ఈ సినిమాతోనైనా విజయ్ రికార్డు బ్రేక్ చేస్తాడా?
Updated : Aug 26, 2024
టాలీవుడ్ యూత్ స్టార్స్ లో టాప్-2 హీరోలంటే నాని (Nani), విజయ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లు చెబుతారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాది, సినిమాల సంఖ్య, విజయాల సంఖ్య పరంగా చూస్తే.. విజయ్ కంటే నాని చాలా ముందున్నాడు. అలాగే ప్రస్తుతం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండగా.. నాని మాత్రం 'దసరా', 'హాయ్ నాన్న' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అన్నింట్లోనూ ముందున్న నాని.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయాడు.
టైర్ 2 స్టార్స్ లో అత్యధిక షేర్ రాబట్టిన సినిమా విజయ్ దే. విజయ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'గీత గోవిందం' 2018లో విడుదలై రూ.70 కోట్ల షేర్ రాబట్టి, ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా వచ్చి ఆరేళ్ళు అవుతున్నా ఇంతవరకు ఈ రికార్డుని నాని బ్రేక్ చేయలేకపోయాడు. 2023లో వచ్చిన 'దసరా'తో నాని ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని భావించారంతా. ఆ అంచనాలకు తగ్గట్టే రికార్డు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ మాస్ సినిమా కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పెద్దగా నోచుకోక, లాంగ్ రన్ లో కలెక్షన్ల జోరు కొనసాగలేదు. దీంతో రూ.64 కోట్ల షేర్ కే పరిమితమైంది. మరో రూ.6-7 కోట్ల షేర్ రాబట్టినట్లయితే.. 'గీత గోవిందం' రికార్డు బ్రేక్ అయ్యి ఉండేది. ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నాడు నాని.
'అంటే సుందరానికీ' వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). ఆగస్టు 29న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 'దసరా' తరహాలో ఈ సినిమాకి కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే అవకాశముంది. అసలే 'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్స్ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా. పైగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ లేదు. ఈ లెక్కన 'సరిపోదా శనివారం'కి పాజిటివ్ టాక్ వస్తే.. రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు. మరి అన్నీ కుదిరి.. ఈ సినిమాతోనైనా 'గీత గోవిందం' రికార్డుని నాని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.