English | Telugu
పెళ్లిపై విజయ్ దేవరకొండ క్లారిటీ
Updated : Aug 10, 2023
టాలీవుడ్‌కి చెందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరోస్‌లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 1న రిలీజ్‌కు సిద్దమవుతోన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మధ్య వచ్చే మనస్పర్ధలు ఎలా ఉంటాయి.. వాటిని వారెలా అధిగమించారనే కథాంశంతో ‘ఖుషి’ సినిమా రూపొందింది. విజయ్ దేవరకొండకు జతగా సమంత నటించింది. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలపై రియాక్ట్ అయ్యారు. వాటిలో పెళ్లికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. దానిపై కూడా రౌడీ స్టార్ స్పందించారు.
ఇంతకీ పెళ్లి ఎప్పడు చేసుకుంటారనే ప్రశ్నపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ‘‘ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలంటే కోపం వచ్చేది. కానీ నేనే ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నా స్నేహితులందరూ పెళ్లి చేసుకుంటున్నారు. వారందరినీ కలిసినప్పుడు మ్యారేజ్ తర్వాత లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అయితే వాటిని దాటి వెళ్లాలి. పెళ్లి జీవితాన్ని ఆస్వాదించాలి. వేరే వాళ్ల జీవితంలోని సమస్యలను చూసి మనం భయపడకూడదు. మరో మూడేళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను’’ అని తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ పెళ్లిపై చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పారు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానా లేక ప్రేమ పెళ్లి చేసుకుంటానా అని మాత్రం చెప్పలేదు.