English | Telugu

రాజ‌మౌళిని ఏకిప‌డేసిన తాప్సి

ఈమ‌ధ్య క‌థానాయిక‌లు మాట‌ల జారుతున్నారు. హీరోల‌పై, ద‌ర్శ‌కుల‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొన్నామ‌ధ్య రాధిక ఆప్టే... తెలుగు హీరోల ఆధిప‌త్య తీరుపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాప్సి... రాజ‌మౌళిని టార్గెట్ చేసింది. లోక‌మంతా బాహుబ‌లిని కీర్తిస్తుంటే... ఈ అమ్మ‌డు మాత్రం పెద‌వి విరిచింది. సినిమా గొప్ప‌గా ఉంద‌ని, అయితే హీరోయిన్ల‌ను పోట్ర‌యిట్ చేసిన విధానం ఏమాత్రం బాగోలేద‌ని, రాజ‌మౌళి స్థాయికి ఇది త‌గ‌ద‌ని సూటిగా చెప్పేసింది ఈ పంజాబీ ప‌డుచు.

ముఖ్యంగా అవంతిక పాత్ర‌లో త‌మ‌న్నాని మ‌ల‌చిన విధానంపై విరుచుకుప‌డింది. ఈ పాత్ర ఉద్దేశం ఏమిటో త‌న‌కు అర్థంకాలేద‌ని, మిగిలిన పాత్ర‌ల‌న్నింటికంటే ఆ పాత్ర అధ్వానంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏకిప‌డేసింది. హీరోయిన్ అంటే.. హీరోల కోసం ప‌డి చ‌చ్చిపోయే పాత్ర‌లుగానే ఎందుకు మ‌లుస్తారో అర్థం కాద‌ని, ఓ క‌థానాయిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

తాప్సి మాట‌ల్లో నిజం లేక‌పోలేదు. ఈ సినిమాలో బ‌ల‌హీన‌మైన పాత్ర అవంతిక‌దే. త‌న‌కేదో పెద్ద ఆశ‌యం ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి.. చివ‌రికి తాను ఓ సామ‌న్యురాలిగానే ఓ మ‌గాడి ప్రేమ‌కు క‌రిగిపోయి, త‌న‌కి లొంగిపోవ‌డం... ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు. ఇలాంటి కామెంట్ల‌ను రాజ‌మౌళి లైట్‌గానే తీసుకొంటాడేమో. కానీ త‌మ‌న్నా మాత్రం కౌంట‌ర్ ఇచ్చే ఛాన్సులున్నాయి. మొత్తానికి చిత్ర‌సీమ‌లో తాప్పి వ‌ర్సెస్ త‌మన్నా వార్ మొద‌ల‌వ్వ‌డానికి బోల్డంత ఆస్కారం ఉంద‌న్న‌మాట‌.