English | Telugu
రీరికార్డింగ్ దిగ్గజం స్వామినాథన్ మృతి
Updated : Jun 25, 2014
సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్‌గా అపార అనుభవం గల ఏఆర్ స్వామినాథన్ ఇకలేరు. మంగళవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. సుమారు 1900 చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పని చేశారు. ప్రపంచంలో మరెవరికీ ఈ ఘణత దక్కకపోవచ్చు. లక్షకు పైగా పాటలు ఆయన రికార్డు చేశారు. వాహినీ సంస్థలో అప్రెంటీస్‌గా చేరిన ఆయన అనతి కాలంలోనే రికార్డిస్టుగా మారారు. 1949లో శబ్ద యంత్రాలను చూసుకునే పనితో మొదలు పెట్టిన ఆయన 1953లో ‘పరోపకారం’ చిత్రానికి తొలిసారి రీరికార్డింగ్ చేశారు. స్వామినాధన్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషా చిత్రాలకు ఆయన సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. వాహినీ తర్వాత ఆయన విజయా, కోదండపాణి రికార్డింగ్ థియేటర్లలో పనిచేశారు. రీరికార్డింగ్ ప్రక్రియకు కొత్త సొబగులు దిద్దిన మహనీయుడిగా సినీపరిశ్రమ ఆరాధించే వ్యక్తి స్వామినాథన్. పాండురంగ మహాత్మ్యం, పాండవ వనవాసం, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, సంపూర్ణ రామాయణం ఇవి ఆయన పని చేసిన తెలుగు చిత్రాలలో కొన్ని. స్వామినాథన్ ఎన్నో నందీ పురస్కారాలు అందుకున్నారు.
87 ఏళ్ల స్వామినాథన్ పదిహేను రోజులుగా ఆయన అనారోగ్యంగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిపించారు. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.