English | Telugu

ప‌టాస్ రివ్యూ

మ‌న‌కు వ‌చ్చిన సినిమాలు తీయాలా?
ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమాలు తీయాలా? అనే మీమాంస ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అభిరుచికి త‌గిన సినిమాలు చివ‌రికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డతాయో లేదో చెప్ప‌లేంగానీ - ప్రేక్ష‌కుల ప‌ల్స్ తెలుసుకొని, వాళ్ల‌కు న‌చ్చిన సినిమాలు తీస్తే మాత్రం 'క‌మ‌ర్షియ‌ల్ హిట్' కొట్ట‌డం ఖాయం. బాక్సాఫీసు రికార్డులు సృష్టించేది, రికార్డుల దుమ్ము దులిపేవి కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. అంద‌కే వాటిని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. ఎంతో కాలంగా విజ‌యాల్లేక నీర‌సించిపోయిన క‌ల్యాణ్‌రామ్ ఈసారి ఎలాంటి పొర‌పాటుకూ తావివ్వ‌కుండా క‌మర్షియ‌ల్ అంశాల‌న్నీ బాగా ద‌ట్టించి... 'ప‌టాస్‌' వ‌దిలాడు. అత‌ని న‌మ్మ‌కం..ఈసారి మాత్రం వ‌మ్ముకాలేదు. కోట్ల‌కు కోట్లు గుమ్మ‌రించే సినిమాకాక‌పోయినా.., క‌ల్యాణ్‌రామ్ కి ఈ సినిమా స‌రికొత్త ఉత్సాహాన్ని ఇవ్వ‌డం మాత్రం ఖాయం. మ‌రింత‌కీ ప‌టాస్‌లో ఉన్న ద‌మ్మెంత‌, దీని జోరెంత చూద్దాం.. రండి.

లంచాల రుచి మ‌రిగిన పోలీసు కళ్యాణ్ (నందమూరి కళ్యాణ్ రామ్). ఏరి కోరి మ‌రీ హైద‌రాబాద్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాడు. ఇక్క‌డ పోలీస్ బాస్‌ కృష్ణ ప్రసాద్ (సాయి కుమార్ ) కి నీతి నిజాయ‌తీ అంటే ప్రాణం. కృష్ణ ప్ర‌సాద్‌ని త‌న చేష్ట‌ల‌తో, దందాల‌తో విసిగించ‌డం మొద‌లెడ‌తాడు క‌ల్యాణ్‌. హైద‌రాబాద్ న‌వాబ్‌లా ఫీలైపోయే జికె (అసుతోష్ రానా)ని అరెస్టు చేసి, పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కించాల‌నేది కృష్ణ ప్ర‌సాద్ ల‌క్ష్యం. అయితే అదే జికెకి తొత్తుగా మార‌తాడు క‌ల్యాణ్‌. దీనంత‌టికీ కార‌ణం.. కృష్ణ ప్ర‌సాద్‌తో క‌ల్యాణ్‌కి ఉన్న వైరం. వీరిద్ద‌రూ తండ్రీ కొడుకులు. ఉద్యోగ‌మే దైవంగా భావించి, ప‌రోక్షంగా త‌న త‌ల్లి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన తండ్రిపై ఇలా ప‌గ తీర్చుకొంటుంటాడు క‌ల్యాణ్‌. అయితే దేవుడిచ్చిన చెల్లి మ‌ర‌ణానికి జికె త‌మ్ముడు కార‌ణం అవుతాడు. ఆ స‌మ‌యంలోనే తండ్రి చేసిన క‌ర్త‌వ్య‌బోధ‌.. క‌ల్యాణ్‌ని మారుస్తుంది. జికె మెడ‌లు వంచి, అత‌ని సామ్రాజ్యాన్ని కూల‌దోయాల‌న్న శ‌ప‌థం పూనుతాడు క‌ల్యాణ్‌. మ‌రి ఆత‌ర‌వాత ఏమైంది?? త‌ల‌తిక్క పోలీస్ చేసిన డ్యూటీ ఎలాంటిది? ఇదంతా.. ప‌టాస్ చూసి తెలుసుకోవాల్సిందే.


తెలుగు చిత్ర‌సీమ‌కు ఇలాంటి క‌థ‌లు కొత్త కాదు. కాక‌పోతే క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు ఎలాంటి లోటూ లేని ఫార్ములా ఇది. త‌ల‌తిక్క‌పోలీసు క‌థ‌లు ఈమ‌ధ్య చాలా వ‌స్తున్నాయి. అందులో ఇదీ ఒక‌టి. ఇందులో.. వినోదం డోసు కాస్త ఎక్కువ‌. అందుకే రొటీన్ సినిమా చూస్తున్న‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌నివ్వ‌కుండా చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో మాస్ చేత ఈల‌లు వేయించిన సీన్స్ అన్నీ.. పాత సినిమాల‌కు ప్రేర‌ణే. అయితే ద‌ర్శ‌కుడు తెలివిగా వినోదాల పూత పూసి... ఆ ఛాయ‌లు దాచే ప్ర‌య‌త్నం చేశాడు. అందులో చాలా వ‌ర‌కూ విజ‌య‌వంత‌మ‌య్యాడు. తొలి స‌గం.. య‌మ‌ఫాస్ట్‌గా సాగుతుంది. కామెడీ సీన్లు, పాట‌. యాక్ష‌న్ ఎపిసోడ్‌.. వీటి మ‌ధ్య సినిమా అంతా న‌ల్లేరుమీద న‌డ‌క‌లా తీసేశాడు ద‌ర్శ‌కుడు. విష‌యం లేని చోట కూడా.. కామెడీ బ‌లంతోనో, టేకింగ్‌తోనో బోర్ కొట్టించ‌కుండా న‌డిపించేశాడు. ఇంట్ర‌వెల్ ద‌గ్గ‌ర హీరోలో మార్పు. అది అంద‌రికీ తెలిసిందే. సెకండాఫ్ కూడా హీరో - విల‌న్ల మ‌ధ్య టిట్ ఫ‌ర్ టాట్ యుద్ధం. సెకండాఫ్ డ‌ల్ అవుతుంద‌నుకొన్న స‌మ‌యంలో రోడ్డుపై గొడ‌వ చేస్తున్న యువ‌త‌రాన్ని దారిలో పెట్ట‌డానికి త‌ల్లుల్ని ఆయుధంగా ఎంచుకొన్న ఎపిసోడ్ కాస్త నిల‌బెడుతుంది. సెకండాఫ్‌లో ఊహించ‌ని ట్విస్టులేం లేక‌పోయినా.. ఓవ‌రాల్‌గా ప‌టాస్ ఓకే సినిమా అనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్ల విష‌యానికొస్తే... క‌ల్యాణ్‌రామ్ క్యారెక్ట‌రైజేష‌న్ మాస్‌కి బాగా న‌చ్చుతుంది. `నా బ్ల‌డ్ కో బ్యాడ్ హాబిట్ ఉంది` అంటూ ఎప్ప‌ట్లా.. అభిమానుల‌కు కిక్ అందించే సంభాష‌ణ‌లు చెప్పాడు. అంతేనా.? ఏకంగా బాల‌య్య పాట రీమిక్స్ చేసి, బాల‌య్య ఫ్లెక్సీలు పెట్టి... నంద‌మూరి అభిమానుల్ని త‌న వైపుకు తిప్పుకొన్నాడు. శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెస్‌ల కామెడీ ఈ సినిమాకి మ‌రో ఆక‌ర్ష‌ణ‌. క‌ల్యాణ్‌రామ్ ప‌క్క‌నే ఉంటూ. శ్రీ‌నివాస‌రెడ్డి పేల్చిన సెటైర్లు ఆక‌ట్టుకొంటాయి. ఇక ఈరోజే మ‌నంద‌రికీ దూర‌మైన హాస్య‌న‌టుడు ఎమ్మెస్ - సునామీ స్టార్‌లా విజృంభించాడు. 801 అంబులెన్స్ చుట్టూ సృష్టించిన కామెడీ కూడా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. మొత్తానికి ఈసినిమాకి కాపాడే ఏకైక అస్త్రం.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అయ్యింది.

క‌ల్యాణ్ రామ్ కి ఓ హిట్టు త‌ప్ప‌కుండా కావాలి. ఆయ‌న కూడా పొర‌పాట్ల‌కు తావివ్వ‌కుండా పైసా వ‌సూల్ క‌థ‌ని ఎంచుకొన్నాడు. న‌టుడిగా రాణించాడు. కాక‌పోతే ఇంకాస్త హుషారుగా క‌నిపించి ఉంటే బాగుండేది. క‌థానాయిక పాత్ర‌కు అంత స్కోప్ లేదు. శ్రుతి కూడా చూడ్డానికేం బాలేదు. మాస్‌లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఉండుంటే.. లుక్కే వేరుగా ఉండేది. సాయికుమార్‌కి మంచి పాత్ర ద‌క్కింది. ఎమ్మెస్‌, పోసానితో స‌హా కామెడీ గ్యాంగ్ అంతా... త‌మ‌కున్న ప‌రిధిలో న‌వ్వులు పంచింది. సాంకేతికంగా ఈ సినిమా రిచ్ గా ఉంది. క‌ల్యాణ్‌రామ్ త‌న మార్కెట్ స్థాయికి మించి ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్టాడు. సాయికార్తిక్ సంగీతంలో గొప్ప మెరుపులేం లేక‌పోయినా.. సినిమాలోని హుషారుని పాట‌లు క్యారీ చేయ‌గ‌లిగాయి. ఆర్‌.ఆర్‌లోనూ.. ఓకే. ద‌ర్శ‌కుడు పాత క‌థ‌నే ఎంచుకొన్నా.. సంభాష‌ణ‌ల బ‌లంతో రాణించ‌గ‌లిగాడు.

మొత్తంగా చెప్పాలంటే ప‌టాస్‌.. ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన సినిమా. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే గెయిన్ అవ్వొచ్చ‌ని న‌మ్మి తీసిన సినిమా ఇది. ఆ న‌మ్మ‌కం వృథా కాదు.

రేటింగ్ 3.25/5

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.