English | Telugu
వావి వరుసలు లేని క్రిమినల్ ప్రేమకథ
Updated : Jul 18, 2014
సమాజంలో అమ్మాయిలు ఎదుర్కుంటున్న అతి దుర్భరమైన సమస్యలలో కొన్నింటిని తెర మీద చూపించేందుకు సునీల్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం 'ఒక క్రిమినల్ ప్రేమకథ' చిత్రం. సామాజిక సమస్యలను లేవనెత్తుతు తీసుకున్న అంశం మంచిదే అయినా ఈ చిత్రంలో కొన్ని సన్నివేషాలు థియేటర్లో చూడడానికి ఇబ్బందిగా అనిపించక మానదు.
కథ విషయానికి వస్తే...
పల్లెటూర్లో చదువుకుంటున్న బిందు (ప్రియాంక పల్లవి) దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబంతో సహా వైజాగ్ లో మేనమామ(సత్యానంద్) ఇంటికి వస్తుంది.
లేత ప్రాయంలో వున్న బిందుతో, వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తుంటాడు మేనమామ. ఎదురించలేని అసహాయత, అయిష్టం మధ్య నలిగిపోతూ వుంటుంది బిందు. ఈ క్రమంలో బిందూని ప్రేమించిన శీను (మనోజ్‌నందం) ఆమెను కలుస్తాడు. అతను తన నిజమైన ప్రేమికుడని గ్రహిస్తుంది. కానీ అతనికి తనపై గల ప్రేమను అడ్డం పెట్టుకుని ఒక షరతు విధిస్తుంది. తనని ప్రేమిస్తున్నది నిజమైతే ఒక వ్యక్తిని చంపమని కోరుతుంది. ఈ విషయం విని షాక్ అయిన శీను తర్వాత ఏం చేస్తాడు అనేది తర్వాత కథ..
మిగతా విషయాలు...
చిత్రంలో ఎంచుకున్న అంశం చాలా సున్నితమైంది. ఈ అంశాన్ని ప్రేక్షకుడిగా తప్పకుండా తెలియచెయ్యాలి, ఆలోచింప చెయ్యాలి అనే కోణం మంచిదనిపిస్తుంది. అదే సమయంలో చాలా అవసరం అని చిత్రీకరించిన కొన్ని రకాల దృష్యాలు, రెగ్యులర్ సినిమాల్లో చూడడానికి ప్రేక్షకులు ఇంకా రెడీగా లేరనే చెప్పాలి. సెక్సువల్ సీన్స్, రేప్ సీన్స్ ఇబ్బంది పెడతాయి.
నేటి సమాజంలో ఆడపిల్లలపై పైశాచికంగా జరుగుతున్న అకృత్యాలకు లెక్క లేదు. వాటిపై ఇంత లోతైన అధ్యయనం జరిపి కథా వస్తువుగా అలాంటి అంశాలను ఎంచుకుని, ధైర్యంగా తెరకెక్కిస్తున్న దర్శకుడిని అభినందించకుండా వుండలేం.
అయితే ఈ అంశాలు ప్రతి వారికి తెలియాలి, రీచ్ అవ్వాలి అంటే ఎబ్బెట్టుగా వుండే దృష్యాలు వేరే విధంగా తీసే ప్రయత్నం చేస్తే బాగుంటందనిపిస్తుంది. ముఖ్యపాత్రలు పోషించిన మనోజ్, పల్లవి, సత్యానంద్ తమ పాత్రలకు న్యాయం చేశారు.