English | Telugu
`ప్రేమమ్` బ్యూటీ.. మళ్ళీ మురిపించేనా!
Updated : Dec 15, 2021
మాలీవుడ్ సెన్సేషన్ `ప్రేమమ్`(2015)తో నాయికగా తొలి అడుగేసింది మడోన్నా సెబాస్టియన్. మొదటి సినిమాతోనే జనం దృష్టిని ఆకర్షించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అంతేకాదు.. అదే సినిమా రీమేక్ తో 2016లో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసింది మడోన్నా. మాతృకలో తను చేసిన పాత్రనే తెలుగులోనూ మరోసారి ధరించింది. ఇక్కడా విజయాన్ని చూసింది. అటుపై మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో తెలుగు చిత్రం చేసింది. ఆ సినిమానే.. `శ్యామ్ సింగ రాయ్`.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ఈ పిరియడ్ డ్రామాలో సాయిపల్లవి, కృతి శెట్టితో పాటు మరో హీరోయిన్ గా కనిపించనుంది మడోన్నా. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగులో మడోన్నా నటించిన రెండు సినిమాలు కూడా ముగ్గురు కథానాయికలతో రూపొందిన చిత్రాలు కావడమే కాకుండా.. `ప్రేమమ్`లో ఒరిజనల్ `ప్రేమమ్` హీరోయిన్స్ లో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ కూడా నటించగా, `శ్యామ్ సింగ రాయ్`లోనూ ఒరిజనల్ `ప్రేమమ్` హీరోయిన్స్ లో ఒకరైన సాయిపల్లవి కూడా నటించడం విశేషం. మరి.. `ప్రేమమ్`లాగే `శ్యామ్ సింగ రాయ్` కూడా మడోన్నాకి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
కాగా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానున్న `శ్యామ్ సింగ రాయ్`ని రాహుల్ సాంకృత్యన్ రూపొందించాడు.
