English | Telugu
చక్కిలిగింత రివ్యూ
Updated : Dec 5, 2014
టీలో పంచదార కలపాలి!
అయితే ఎంత మోతాదులో. కప్పు టీలో ఓ చెంచానో, రెండు చంచాలో. ఉగ్గెడు కప్పులో గుప్పెడు పంచదార గుమ్మరిస్తే.. దాన్ని టీ అనరు.. పానకం అంటారు. కొత్తదనం కూడా అలానే ఉండాలి. తెలిసిందంతా గుమ్మరిస్తే, రాసుకొన్నంతా చెప్పాలనుకొంటే, తీసిందంతా చూపించాలనుకొంటే.. అదోరకమైన టార్చర్‌లా తయారవుతుంది. సినిమాలో ఒకరి క్యారెక్టరైజేషనే తేడాగా ఉంటే భరించలేకపోతున్నాం. అలాంటిది రెండు మూడు క్యారెక్టర్లు... తేడాగా ప్రవర్తించి, ఆర్యలా ఇబ్బంది పెడితే.. ప్రేక్షకుడికి మాత్రం షాకే! అలా షాకిచ్చి షేక్ చేసిన సినిమా చక్కిలిగింత.
సుకుమార్ దగ్గర ఓ విచిత్ర లక్షణం ఉంది. తన హీరో ఎప్పుడూ అబ్ నార్మల్‌గా బిహేవ్ చేస్తుంటాడు. తేడా తేడా పనులతో. అందరూ ఫాలో అయ్యే సిద్దాంతానికి రివర్స్‌లో వెళ్తాడు. అది కొంతవరకూ బాగుంటుంది. ఎక్కువైతే తేడా కొడుతుంది. ఒక్కడితోనే ఎడ్జిస్ట్ అవ్వలేక 'సుకుమార్ మరీ హెవీగా వెళ్లిపోతున్నాడ్రోయ్' అనుకొంటుంటే.. ఇప్పుడు ఆయన బ్యాచ్ నుంచి వేమారెడ్డి వచ్చాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్.. వీరిద్దరితో పాటు మరో రెండు క్యారెక్టర్లు తేడాగా ప్రవర్తిస్తుంటాయి... అబ్‌నార్మల్‌గా మాట్లాడుతుంటాయ్. ఈ క్యారెక్టరైజేషన్స్ పెట్టిన కన్‌ఫ్యూజ్‌లో... చక్కిలిగింతలు పుట్టాయా? చెక్కిళ్లమీద నుంచి కన్నీళ్లు జారాయా... చూద్దాం రండి.
అనగనగా ఓ కాలేజీ. ప్రతీ కాలేజీలోలానే అబ్బాయిలు అమ్మాయిల వెంట పడుతుంటారు. ఐ లవ్ యూ అంటూ బతిమాలేస్తుంటారు. ఈ పద్ధతి ఆడి (సుమంత్ అశ్విన్)ని నచ్చదు. తనో ఫార్ములా కనిపెడతాడు. ''ఎవాయిడ్ గర్ల్స్''. అమ్మాయిల్ని దూరంగా పెట్టండి.. అప్పుడే మీకు దగ్గరవ్వాలని చూస్తారు, ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పొద్దు, వాళ్లు చెప్పేంత వరకూ ఎదురుచూడండి... అంటూ ప్రేమపాఠం ఉపదేశిస్తాడు. అది వర్కవుట్ అవ్వడం ప్రారంభిస్తుంది. `వీడెవడో మన ఫీలింగ్స్‌తో ఆటాడేసుకొంటున్నాడం`టూ అమ్మాయిలంతా మీటింగ్ పెట్టుకొంటారు. అయితే నేను కూడా ఓ ఫార్ములా కనిపెడతా అంటూ అవంతిక (రెహానా) ముందుకొస్తుంది. అవిని ప్రేమలోకి దింపి.. తన చేత ఐ లవ్ యూ చెప్పించి - ఎవాయిడ్ గర్ల్స్ అన్న ఫార్ములా తప్పు అని నిరూపిస్తా అంటుంది. అందులో భాగంగా అవితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. ''మనమిద్దరం కొంతకాలం లవర్స్ కాని లవర్స్ గా ఉందాం. నువ్వు డిస్ట్రబ్ అవ్వకుండా ఉంటే నువ్వే గెలిచినట్టు..'' అని పందెం కాస్తుంది. అప్పటి నుంచి.. వీరిద్దరూ లవ్ గేమ్ మొదలెడతారు. అప్పటివరకూ అమ్మాయిల విషయంలో ఎలా ఉండాలో... తానే చెప్పిన థీరీ రివర్స్ అవుతుంటుంది. సాధారణ అబ్బాయిల్లానే ఆడి మారిపోతాడు. అవిని చూడకుండా ఉండలేకపోతాడు. అందరి ముందూ ''ఐ లవ్ యూ'' చెప్పేస్తాడు. ''చూశావా? నీ ఫార్ములా తప్పు. అది తప్పని నిరూపించడానికే నీతో ఈ లవ్ గేమ్ మొదలెట్టా. నా పని అయిపోయింది '' అంటుంది. మరి అవిని ఆడి ఎలా తన ప్రేమలో దింపాడు. ఆడి ప్రవేశ పెట్టిన మరో ఫార్ములా ఏంటి? వీరిద్దరూ ఎలా కలుసుకొన్నారు? అనేదే మిగిలిన కథ.
2 + 2 = 4 అనేంత ఈజీ కాదు.. ఈ లవ్ ఫార్ములా మీరు అర్థం అవ్వడం స్టోరీ ఇలా చెప్పగలిగాం గానీ.. తెరపై ఈ కథ అనేక వంకర్లు తిరుగుతుంటుంది. బేసిగ్గా హీరో హీరోయిన్లకు ఈగో ప్రాబ్లం. సాధారణంగా ప్రేమ విషయంలో అబ్బాయే ముందు చెప్పాలని అమ్మాయి, అమ్మాయే ముందు బయటపడాలని ఎదురు చూస్తుంటారు.. దానికి ఓ ఫార్ములా పేరు పెట్టి, విచిత్రమైన క్యారెక్టర్లు దింపి ఆడేసుకొన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో పాత్రలు, వాళ్లు మాట్లాడే భాష.. అంతా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు..
అబ్బాయి అమ్మాయిని ముద్దు అడుగుతాడు.
ఐ లవ్ యూ చెబితేనే ఇస్తా అంటుంది అమ్మాయి.
నేను చెప్పను అంటాడు అబ్బాయి.
వెంటనే అమ్మాయి అబ్బాయి చెంప మీద ముద్దు పెట్టేస్తుంది.
ఇది నువ్వు అడిగిన ముద్దు కాదు.. నాకు ఇవ్వాలనిపించిన ముద్దు... అంటుంది!
అదేం లెక్కో..! ఇలాంటి గమ్మత్తులు ఎన్నని చెప్పుకోవాలి. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ సినిమాలో కొన్ని కాన్సెప్పుటు బాగున్నాయి. థ్యాంక్స్ బాక్స్ లాంటివన్నమాట. అయితే ఈ థీరీలూ, లెక్కలూ, డైలాగుల్లో డెప్తులూ సామాన్య ప్రేక్షకుడికి అర్థమవుతాయా? అన్నదే బిలియన్ డాలర్ల ప్రశ్నలు. వేమారెడ్డి టాలెంటెడే. అయితే ఆ ప్రతిభ అంతా బూడిదలో పోసిన పన్నీరైందేమో అనిపిస్తుంది. అందరూ వింత వింతగా మాట్లాడుతుంటారు. అవన్నీ అర్థం చేసుకొనేంత ఓపిక, శక్తి మనకు ఉండవు.
నిడివి విషయంలో దర్శకుడు నిర్లక్ష్యం చేశాడు. రాక రాక మెగాఫోన్ పట్టుకొనే అవకాశం వచ్చిందని, అనుకొన్న సీన్లన్నీ తీసి పాడేశాడు. అందుకే.. సినిమా అలా నిదానంగా సాగుతూ సాగుతూ ఉంటుంది. సినిమా అయిపోయిందని లేచేలోగా మళ్లీ కూర్చోబెట్టి ఓ పాట, నాలుగు సీన్లూ, ఓ ట్విస్టూ చూపించి... మరీ పంపించాడు. ఏ పాత్ర ఎందుకు, ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకొని, వాళ్లు మాట్లాడే మాటలకు మీనింగులు వెతుక్కొనేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సినిమా అంతా అయ్యాక అసలు ఏం చెప్పాలనుకొన్నాడు? ఏం చెప్పాడు? ఏం చూపించాడు? అర్థం కాక మెంటల్ ఎక్కే మెట్టు ముందు ఆగిపోతారు! ఈ చక్కిలిగింత పార్టు పార్టులుగా చూస్తే బాగుంటుంది. అన్నీ కలిపి చూసినప్పుడే.. మనసు హర్టు అవుతుంది. ఇది గ్యారెంటీ!
ఏదైనా సరే.. సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ల అంచనాలకూ, ఆలోచనలకూ మించిన భారమూ వేయకూడదు.. అనే విషయం `1` నేనొక్కడినే లాంటి సినిమాలతో అర్థమైంది. ఇప్పుడు వేమారెడ్డీ అదే తప్పు చేశాడు. తన ప్రావిణ్యం అంతా చక్కిలి గింతలో పొర్లించాలని చూశాడు. అదే భారీగా బెడసికొట్టింది.
సుమంత్, రెహానా ఇద్దరూ పోటీపడి నటించారు. వాళ్ల క్యారెక్టరైజేషన్లని అర్థం చేసుకోవడమే కష్టం. అలా చేసుకొని, ఒంట్లోకి ఎక్కించుకొని, వారిలా బిహేవ్ చేయడం.. బాగుంది. వీరిద్దరికీ మినహా ఈ సినిమాలో మరొకరికి స్కోప్ లేదు. ప్రతీ సీన్‌లోనూ ఇద్దరే కనిపిస్తుంటారు. ఆఖరికి ఫైటింగుల్లోనూ ఈ ఇద్దరూ ఉండాల్సిందే. మిక్కీ ఇంకా కొత్త బంగారులోకం మూడ్‌లోనే ఉన్నాడు. అందులోంచి అర్జెంటుగా బయటకు వచ్చేయాలి. ఆర్.ఆర్ విషయంలోనూ అవే ట్రాకులు ఎత్తుకొచ్చేశాడేమో అనిపిస్తుంది. ఎడిటర్ కి ఇచ్చిన పారితోషికం వెనక్కి తీసేసుకొంటే మంచిది. అసలు ఎక్కడ కత్తిరించాడని.? ''బాబూ.. ఈ సీన్ వద్దూ..'' అని చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు హై క్లాస్. పాటల చిత్రీకరణ కూడా కొత్తగా ఉంది.
కొత్తదనం లేదూ. లేదూ అని బాధపడుతూ కూర్చుంటాం. అయితే ఈ సినిమాది మరో సమస్య. కొత్తదనం ఎక్కువైనా తలనొప్పే వస్తుందని చక్కిలిగింత రుజువు చేసింది. మన స్థాయిని అందని క్యారెక్టర్లు తెరపై తమకిష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తుంటే.. మనం మైండ్‌ని తెరకి ఇచ్చేసి మౌనంగా భరించాల్సింది తప్ప ఏం చేయలేం..
ట్యాగ్ లైన్: ''మన చక్కిలిగింతలు మనమే పెట్టుకొంటే ఓకే..''
రేటింగ్ 2.25