English | Telugu

లయ‌న్‌ రివ్యూ

మ‌న క‌థ‌లు గాల్లో పుడుతుంటాయి. హీరోలు ఆకాశం నుంచి ఊడిప‌డిన‌ట్టు.. అద్భుతాలు సృష్టించేస్తుంటారు.
ఏంటి బాసూ... ఎక్క‌డా లాజిక్ లేదు.. - అని బుర్ర గోక్కుంటాడు ప్రేక్ష‌కుడు!
లాజిక్ ఎత్తితే... ప్ర‌తి సినిమా ఫ‌స్ట్ సీన్‌లోనే `అవుట్‌` అయిపోద్ది. దాన్ని క్ష‌మించేసి..
హీరోని ఫాలో అయిపోయి, క‌థ‌ని జీర్ణం చేసుకొని, స‌గ‌టు ప్రేక్ష‌కుడిలా సంతృప్తిప‌డిపోతే... 'ల‌య‌న్‌' సినిమా మీకు ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది.
ఎందుకంటే ఇది బాల‌య్య ఇమేజ్‌ని బేస్ చేసుకొని రాసుకొన్న క‌థ‌.
ఇది బాల‌య్య అభిమానుల్ని సంతృప్తిప‌రచ‌డానికి అల్లిన స్ర్కీన్ ప్లే.
సంభాష‌ణ‌లు, పాట‌లూ, రొమాన్స్‌.. అన్నీ కేవ‌లం అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని చేసిన గార‌డీ. ముందే చెప్పిన‌ట్టు 'లాజిక్‌'ని గాలి కొదిలేసి థియేట‌ర్లో కూర్చుంటే... బాల‌య్య స‌ర‌దా స‌ర‌దాగా కాల‌క్షేపం అందించేస్తాడు. ఇంత‌కీ ఈ ల‌య‌న్ ఎలా ఉంది? ఏంటా క‌థ‌.. చూద్దాం. రండి.

ఆసుప‌త్రిలోని మార్చురీ రూమ్‌లో క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డ శ‌వంలా ప‌డుకొన్న బోస్ (బాలకృష్ణ‌) స‌డన్‌గా లేస్తాడు. డాక్ట‌ర్లు కూడా షాక్ అయిపోతారు. కాక‌పోతే ఎవ్వ‌రినీ గుర్తుప‌ట్ట‌లేడు. త‌న పేరు.. బోస్ అనుకొంటాడు గానీ... అస‌లు పేరు గాడ్సే. ఆఖ‌రికి త‌న అమ్మానాన్న (జ‌య‌సుధ‌, చంద్ర‌మోహ‌న్‌) ల‌ను కూడా గుర్తు ప‌ట్ట‌డు. ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా హైద‌రాబాద్ వ‌స్తాడు. అక్క‌డ బోస్‌గా త‌న ఉనికిని వెదుక్కొనే ప‌నిలో ప‌డ‌తాడు. ముందుగా తాను ప్రేమించిన మ‌హాల‌క్ష్మి (త్రిష) క‌నిపిస్తుంది. ఆమె కూడా ''నువ్వెవ‌రివో నాకు తెలీదు'' అంటుంది. ఎవ‌రినో (చ‌ల‌ప‌తిరావు, గీత‌) లను చూసి మీరే నా త‌ల్లిదండ్రులు అంటూ వెంట‌ప‌డ‌తాడు. అక్క‌డా.. ఎదురుదెబ్బే త‌గులుతుంది. ''నువ్వు మా బిడ్డ‌వి కాదు'' అంటారు వాళ్లు. బోస్‌కి పిచ్చెక్కిపోతుంది. తాను బోస్ కాద‌ని, గాడ్సే అని త‌న‌ని తాను స‌మాధానం చెప్పుకొంటాడు. ఈలోగా క‌థ‌లో ఓ మ‌లుపు. అదేంటి? ఇంత‌కీ బోస్ ఎవ‌రు, గాడ్సే ఎవ‌రు? ఇద్ద‌రికీ ఉన్న సంబంధం ఏమిటి? బోస్ ఆసుప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య ఉండ‌డానికి కార‌ణం ఏమిటి? అనేది తెలుసుకోవాంటే ల‌య‌న్ చూడాలి.

బోస్‌, గాడ్సే అనే రెండు పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఈ చిత్రం. తాను బోసా? గాడ్సేనా అని తెలియ‌క తిక‌మ‌క ప‌డే వ్య‌క్తి జీవితం.. ఈ చిత్రం. క‌థ ఆస‌క్తిక‌రంగానే మొద‌లైంది. నిజంగానే బాల‌య్య సినిమాల్లో ఇదో డిఫ‌రెంట్ స్టోరీ లైన్‌. గాడ్సే.. తాను బోస్ అని న‌మ్మించ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు, అవి విఫ‌ల‌మైతే ప‌డే మాన‌సిక వేద‌క‌... ఇవ‌న్నీ సీరియ‌స్‌గా సాగేవే. కాక‌పోతే అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి పాత్ర‌ల‌తో... వాటిలోనే కాస్త ఎంట‌ర్‌టైన్ మెంట్ మిక్స్ చేశాడు. ఒక వైపు బోస్ ఫ్లాష్ బ్యాక్‌, మ‌రో వైపు గాడ్సే ప్ర‌స్తుతం... క‌ల‌సి స్ర్కీన్ ప్లేని కాస్త ఇంట్ర‌స్టింగ్‌గా డిజైన్ చేసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఈ క‌థ‌కు ప్రాణం. అక్క‌డ చిక్కుముడుల‌న్నీ విడిపోయి.. కొత్త ట్విస్టుల‌కు దారి క‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్ కొత్త‌గా రాసుకొన్న స‌త్య‌దేవ‌.. సెకండాఫ్‌లో రొటీన్ ఫార్ములాకి వెళ్లిపోయాడు. సెకండాఫ్‌లో బోస్ (సీబీఐ ఆఫీసర్‌) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డి నుంచి ఫ‌స్టాఫ్‌లోని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొరికేస్తాయి. ప్ర‌తినాయ‌కుడు (ప్ర‌కాష్‌రాజ్‌)ని ఓడించ‌డానికి బోస్ ల‌య‌న్‌లా ఎలా గ‌ర్జించాడ‌న్న‌ది రొటీన్ ఫార్ములానే.


క‌థ లాజిక్ కి దూరంగా ఉన్నా - బాల‌య్య అభిమానుల‌కు ఆశ‌ల‌కు, అంచ‌నాల‌కు మాత్రం కాస్త ద‌గ్గ‌ర‌గానే ఉంది. బాల‌య్య‌ని ఎలా చూడాల‌నుకొంటున్నారో.. అలానే ద‌ర్శ‌కుడు ప్ర‌జెంట్ చేయ‌డానికి తాప‌త్ర‌య ప‌డ్డాడు. బాల‌య్య సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ సీన్స్‌, సంభాష‌ణ‌లు.. ఓ ఊహించ‌ని ట్విస్టు ఆశిస్తారు. అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇక బాల‌య్య - త్రిష ల‌మ‌ధ్య సాగే రొమాన్స్‌... బోన‌స్ అను్కోవాలి. ఈ కాంబినేష‌న్ కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా.. వాళ్ల రొమాన్స్ లోనూ కామెడీ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాక‌పోతే.. ఈ సినిమాకి ఇంకాస్త ఆస‌క్తిక‌రంగా, ఇంకొన్ని భావోద్వేగాలు ముడిపెట్టి న‌డిపించొచ్చు. కానీ ద‌ర్శ‌కుడికి ఆ స్టామినా స‌రిపోలేదు. ట్విస్ట్ రివీల్ చేయ‌డంలో స‌త్య‌దేవా పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. దానికి తోడు సెకండాఫ్ క‌థ‌ని గాలికొదిలేసి.. నిజంగానే సినిమాని గాల్లో న‌డిపించాడు. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర‌మ రొటీన్‌. ఇక లాజిక్ గురించి ఆరా తీస్తే.. ప్ర‌తీ సీన్ ఫెయిల్ అయిన‌ట్టే లెక్క‌. ఏదో బాల‌య్య కోసం ఆయ‌న‌ అభిమానులు కాస్త గుండె నిబ్బంరం చేసుకొంటే త‌ప్ప‌... రెండు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చోలేం.

బాలకృష్ణ ఒంటిచేత్తో న‌డిపించిన సినిమాల్లో ఇదీ ఒక‌టి. త‌న పాత్ర‌లో రెండు షేడ్స్‌నీ చ‌క్క‌గా చూపించారు. ముఖ్యంగా గాడ్సే పాత్ర‌లో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. బోస్‌గానూ ఓకే గానీ.. గాడ్సేకే మార్కులు ప‌డ‌తాయి. ఆహార్యం విష‌యంలో ఇంకొంత జాగ్ర‌త్త ప‌డాల్సింది. త్రిష అందంగా క‌నిపించింది. అభిన‌యానికి పెద్ద స్కోప్ లేదు. రాధికా ఆప్టేది ఇంకా తీసిక‌ట్టు పెర్‌ఫార్మెన్స్‌. ప్ర‌కాష్‌రాజ్ రొటీన్ గా కొట్టుకెళ్లిపోయాడు. ఇక మిగిలిన వాళ్ల‌కు చెప్పుకోద‌గిన స్కోప్ లేదు.

మ‌ణిశ‌ర్మ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఒక‌ట్రెండు పాట‌లు మాస్‌ని ముఖ్యంగా బాల‌య్య అభిమానుల్ని ఆక‌ట్టుకొంటాయి. సంభాష‌ణ‌ల విష‌యంలో ర‌చ‌యిత కంటే బాల‌య్య‌కే మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే రొటీన్‌, సాదాసీదా డైలాగ్‌నీ బాల‌య్య త‌న సంభాష‌ణా చాతుర్యంతో ర‌క్తిక‌ట్టించాడు. ద‌ర్శ‌కుడిగా స‌త్య‌దేవ‌కి అర‌కొర మార్కులే ప‌డ‌తాయి. ఓ మంచి ప్రారంభాన్ని.. పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. లైన్ బాగున్నా.. టేకింగ్‌, దాన్ని న‌డిపించిన విధానం బీసీనాటి రోజుల్ని త‌ల‌పిస్తుంది.

ఈ సినిమా చూడాలంటే క‌చ్చితంగా బాల‌య్య అభిమాని అయ్యిండాలి. లేదంటే.. `పాత‌` సినిమాల్ని, అప్ప‌టి టేకింగ్‌నీ ఇంకా ఇష్ట‌ప‌డేవాళ్ల‌యిఉండాలి. లేదంటే.. ల‌య‌న్ `లైన్‌` దాట‌గ‌లిగే గట్స్ ఎవ‌రికుంటాయ్‌..??

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.