English | Telugu
డిక్టేటర్ గుండెల్లో గుబులు
Updated : Jan 9, 2016
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి గానీ.. ప్రతీ సినిమాకీ ఏదో ఓ సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా డిక్టేటర్‌కి థియేటర్ల సమస్య ఎదురైంది. అదీ ఇక్కడ కాదు.. అమెరికాలో. అక్కడ ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. అందుకు సర్వం సిద్ధం చేసుకొన్నారు. అయితే.. ఇప్పుడు డిక్టేటర్‌కి తగినన్ని థియేటర్లు దొరకడం లేదు.
నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా ఆల్రెడీ అమెరికా థియేటర్లను ఆక్రమించుకొన్నాయట. రెండు నెలల ముందే ఎక్స్‌ప్రెస్ రాజా థియేటర్లన్నీ బుక్కయిపోయాయని టాక్. నాన్నకు ప్రేమతో కూడా కాస్త అడ్వాన్సుగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు డిక్టేటర్‌కి అక్కడ థియేటర్లు దొరకడం లేదు. దాంతో ఈసినిమాని అమెరికాలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు వచ్చిందట చిత్రబృందం.
అమెరికాలో లేటుగా విడుదలైతే.. ప్రమాదం. ముందే రిజల్ట్ తెలిసిపోతే.. ప్రవాసాంధ్రులు సినిమా చూడరు. అందుకే.. దొరికిన థియేటర్లతో సరిపెట్టుకొందామా అని ఆలోచిస్తున్నారు. కనీసం 70 థియేటర్లు దొరికినా సినిమా వేసేద్దామనుకొంటున్నార్ట. సాధారణం బాలయ్య సినిమాలు అక్కడ దాదాపు 150 థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే ఇప్పుడు 50 థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఎదురైందట. మరి.. ఈ కష్టాల నుంచి డిక్టేటర్ ఎలా బయటపడతాడో చూడాలి.