English | Telugu
బాలయ్య బాలయ్య..నువ్వంటే ప్రేమయ్యా...!
Updated : Jun 10, 2015
నందమూరి నటసింహం.. లెజెండ్.. బాలకృష్ణ
ఈ పేరు చెబితే - అభిమానులే కాదు, బాక్సాఫీసూ కాలర్ ఎగరేస్తుంది!
సిల్వర్ స్ర్కీన్ తొడగొడుతుంది.
చిత్రసీమ పండగ చేసుకొంటుంది.
''చరిత్ర సృష్టించాలన్నా - తిరగరాయాలన్నా మేమే...''
పెన్నుంది కదా అని రాయించిన డైలాగ్ కాదిది. పంచ్‌ల కోసం చెప్పిన డైలాగ్ కాదిది. చరిత్ర తిరగేస్తే... అదే చెప్తుంది. హీ ఈజ్ బాక్సాఫీసు బొనాంజా అని.
బాలయ్య నడిచే దారిలో రికార్డులు సలాములు కొడుతూ పలకరిస్తుంటాయి.
బాలయ్య తొడగొడితే.. ఆ సౌండుకి కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. ఈ మాటా చరిత్రే చెబుతుంది.
విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ - వారసుడంటే ఎలా ఉండాలి?? ఎన్ని కళల్ని అవపోశాన పట్టాలి?? ఎన్ని కోట్ల అభిమానగణ ఆశలు మోయాలి..?? అచ్చంగా బాలకృష్ణ కూడా అలానే ఉన్నాడు. అలానే నవరసాలూ.. తనలో ఆవాహన చేసుకొన్నాడు. అన్ని కోట్ల ఆశల్ని అంచాల్నీ భుజాల మీద మోశాడు.. మోస్తూనే ఉన్నాడు.
బాలయ్య అంటే యాక్షన్ హీరోనో, డాన్సుల హీరోనో, డైలాగుల హీరోనో కాదు. ఎప్పుడూ కాదు.. ఎప్పటికీ కాదు.
ఓ మంగమ్మ గారి మనవడు, ఓ భైరవ ద్వీపం, ఓ ఆదిత్య 369, ఓ నారీ నారీ నడుమ మురారి... ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది బాలయ్యలోని వాడీ వేడీ ఎలా ఉంటుందో...? నవరస నటనా సార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఆయన దారిలోనే నడిచాడు. ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకొన్నాడు. అంతెందుకూ... రాముడి పాత్రంటే నందమూరి తారక రామారావు నటనా విన్యాసాన్ని చూసి తరించాల్సిందే. ఆ పాత్ర ఎవరు పోషించాలన్నా గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఆ సాహసం చేయాలంటే.. ఏటికి ఎదురీదే ధైర్యం ఉండాలి. ఇవి రెండూ పుష్కలంగా ఉన్నాయి.. బాలకృష్ణలో. అందుకే తన తండ్రికి మాత్రమే సాధ్యమైన రామాయణ గాథలోనూ ఔరా అనిపించాడు. శ్రీరామరాజ్యంలో రాముడిగా మెప్పించాడు.
డైలాగ్ చెప్పాలంటే బాలకృష్ణే. ఎంతటి క్లిష్టమైన సంస్ర్కృత సమాసాన్నైనా అవలీలగా... మంచినీళ్ల ప్రాయంలా వల్లించేస్తాడు. పౌరుషమైనా, సరసమైనా, సరదా అయితే.. బాలయ్య నటిస్తే.. అభిమానులకు పండగే.
తెలుగు భాషన్నా, తెలుగు సంస్ర్కృతి అన్నా బాలయ్యకు మిక్కిలి అభిమానం. అందుకే.. తెలుగు పురాణాలు, ఇతిహాసాల గురించి ఔపోసాన పట్టారు. తాను తెలుసుకొన్న నీతిసూత్రాలను తన తోటివారితోపంచుకొంటారు. బాలయ్య సెట్లో ఖాళీగా ఉన్నాడంటే ఓ సంస్ర్కృత సమాసమో, ఓ పద్యమో వదలాల్సిందే. అది విని, అందులోని అర్థం తెలుసుకొని... మిగిలినవాళ్లు తరించాల్సిందే. ఇది బాలయ్య స్కూలు.
తండ్రిలానే క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు బాలకృష్ణ. క్రమశిక్షణ లేదంటే.. ఎంత ప్రతిభ ఉన్నారాణించదన్నది బాలయ్య మాట. ఉదయం బాలయ్య నిద్రలేచేది ఎప్పుడో తెలుసా..? తెల్లవారుఝామున మూడున్నరకి. తండ్రి దగ్గర నుంచి అబ్బిన అలవాటు ఇది. ఇష్టదైవం నరసింహస్వామికి పూజా కార్యక్రమాలు ముగించందే ఏ పనీ ముట్టరు బాలయ్య. ప్రతీ పనీ టైమ్ ప్రకారం జరిగిపోవాల్సిందే. ఇంత క్రమశిక్షణ ఉందికాబట్టే... ఇన్ని విజయాలు మూటగట్టుకొన్నారు.
ట్రెండ్ సృష్టించడంలో బాలయ్యకు బాలయ్యే సాటి. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ కథల్లో మజాని పరిచయం చేశాడు బాలయ్య. నరసింహనాయుడు, సింహ, లెజెండ్ సృష్టించిన రికార్డులు ఇంకా అభిమానుల్ని మురిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డిక్టేటర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలయ్య. ఇది బాలయ్య 99వ సినిమా. బాలయ్య వందో సినిమా కూడా త్వరలోనే పూర్తి చేసుకోవాలని, అభిమానుల్ని ఇలానే అలరిస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకొందాం..
(నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా)