English | Telugu
కష్టం వాళ్లది... క్రెడిట్ బన్నీదీ!
Updated : Oct 10, 2015
గుణశేఖర్ తొమ్మిదేళ్ల కష్టం.. రుద్రమదేవి.
అనుష్క మూడేళ్ల శ్రమ.. రుద్రమదేవి.
అయితే ఇప్పుడు క్రెడిట్ అంతా అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఏ నోట విన్నా... గోనగన్నారెడ్డి కబుర్లే. సినిమా చూసొచ్చి రుద్రమదేవి ఎలా ఉంది అని అడిగితే.. గోన గన్నారెడ్డి బాగున్నాడంటున్నారంతా. అంతాలా మ్యాజిక్ చేశాడు బన్నీ. ఈ సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి, పైసా పారితోషికం తీసుకోకుండా ఇందులోని కీలకమైన పాత్ర చేసి సినిమాని నిలబెట్టాడు బన్నీ. సినిమాలోనూ అంతే. రుద్రమదేవిలో విషయం లేదని ఆడియన్ నీరసపడుతున్నప్పుడల్లా టానిక్‌లా కనిపించాడు బన్నీ. తన డైలాగులతో, నటనతో, బాడీ లాంగ్వేజీతో అదరొట్టేశాడు. రుద్రమదేవి సినిమా కాస్త... గోనగన్నారెడ్డి మ్యాజిక్‌లా మారిపోయింది. అనుష్క గురించి మర్చిపోయారు, గుణ శేఖర్ గురించి మర్చిపోయారు... అందరూ గోనగన్నారెడ్డిగా బన్నీ గురించే మాట్లాడుకొంటున్నారు. ఈసినిమా కోసం మహా అయితే రెండు నెలలు కష్టపడుంటాడు బన్నీ. కానీ.. క్రెడిట్ మొత్తం కొట్టేశాడు. బన్నీలోని ఓ కొత్త డైమెన్షన్ ఈ సినిమాతో బయటపడిందంటున్నారంతా. బన్నీకీ.. ఈ రిజల్ట్ ఆనందాన్ని కలిగిస్తోంది. బన్నీ చేసిన త్యాగం నూటికి నూరుపాళ్లు పలించింది.