English | Telugu
అఖండ-2 ఓటీటీ బిజినెస్.. దిమ్మతిరిగే అమౌంట్..!
Updated : Jun 12, 2025
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగునాట అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వీరి కలయికలో 'అఖండ-2' రూపుదిద్దుకుంటోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబో.. దానికి తోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళింది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. (Akhanda 2 OTT Rights)
'అఖండ-2' దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదలకు ఇంకా మూడు నెలలకు పైగా సమయముంది. అయినా అప్పుడే దిమ్మతిరిగే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. 'అఖండ-2'పై అనౌన్స్ మెంట్ సమయం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. బాలకృష్ణ లుక్ కి, త్రిశూలం షాట్ కి అందరూ ఫిదా అయ్యారు. బాలయ్య-బోయపాటి మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం పలు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో.. ముందు వరుసలో ఉందట. నిర్మాతలు ఓటీటీ రైట్స్ ను రూ.85 కోట్ల దాకా చెబుతున్నారని.. రూ.80 కోట్లకు అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ టాప్ ఫామ్ లో ఉన్నారు. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇలా వరుసగా నాలుగు సక్సెస్ లను చూశారు. థియేటర్లలో మాత్రమే కాకుండా, ఓటీటీలోనూ బాలకృష్ణ సినిమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఆయన గత చిత్రం 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. దీంతో 'అఖండ-2' డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఆసక్తి చూపిస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ కి మించిన అమౌంట్ చెల్లించడానికి రెడీ అయినట్లు వినికిడి. ఏది ఏమైనా కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే.. 'అఖండ-2' సుమారుగా రూ.80 కోట్లు రాబట్టుకునే అవకాశముంది.