English | Telugu
14 ఏళ్ళ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`
Updated : Apr 27, 2021
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ ఒకరు. అలా.. వెంకీ నటించిన కుటుంబకథా చిత్రాల్లో `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` ఒకటి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకీకి జంటగా త్రిష నటించగా.. `కలర్స్` స్వాతి, కె. విశ్వనాథ్, శ్రీరామ్, కోట శ్రీనివాసరావు, సునీల్, రాజ్యలక్ష్మి, వినయ ప్రసాద్, జీవా, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి, హరితేజ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ముమైత్ ఖాన్, మేఘనా నాయుడు ప్రత్యేక గీతాల్లో తళుక్కుమన్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``అల్లంత దూరాల``, ``నా మనసుకి``, ``ఏమైంది ఈ వేళ``.. వంటి గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. తమిళంలో `నీ యారాడి మోహిని`, బెంగాలీలో `100% లవ్`, భోజ్ పురీలో `మెహందీ లగా కే రఖ్ నా`, కన్నడలో `అంతు ఇంతు ప్రీతి బంతు`, ఒడియాలో `ప్రేమ అదే అక్ష్యర` టైటిల్స్ తో రీమేక్ అయిన ఈ సినిమాకి.. `బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ యాక్టర్` (వెంకటేశ్), `బెస్ట్ డైలాగ్ రైటర్` (గోపీ-రమేశ్) విభాగాల్లో `నంది` పురస్కారాలు - `బెస్ట్ యాక్ట్రస్` (త్రిష) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ దక్కాయి. శ్రీసాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.. 2007 ఏప్రిల్ 27న విడుదలైంది. నేటితో `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` 14 వసంతాలను పూర్తిచేసుకుంది.
