English | Telugu

గన్నవరం పంచాయతీకి ఎండ్ కార్డ్... భవిష్యత్తులో తలనొప్పులు తప్పవా?

గన్నవరం వైసీపీలో తీవ్ర కలకలం రేపిన వల్లభనేని వంశీ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది. వల్లభనేని వంశీ రాకను మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ దొరికింది. కృష్ణాజిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితోపాటు జగన్మోహన్ రెడ్డిని కలిసిన యార్లగడ్డ... వల్లభనేని వంశీ ఇష్యూపై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అయితే, జగన్ దగ్గర కూడా వంశీ రాకపై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, గన్నవరంలో పరిస్థితులను, ఎన్నికల సమయంలో వంశీ బెదిరింపులను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పార్టీ కోసం పని చేయాలని, మీ రాజకీయ భవిష్యత్తుకు నాదీ భరోసా అంటూ జగన్ హామీ ఇవ్వడంతో యార్లగడ్డ మెత్తబడినట్లు తెలుస్తోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇవ్వడంతో వంశీతో కలిసి పనిచేసేందుకు యార్లగడ్డ ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది.

కేవలం 900 ఓట్ల తేడాతో ఓడిపోవడం, వంశీకి యార్లగడ్డ గట్టి పోటీనివ్వడంతో, ఇరువురికి ఆమోదయోగ్యమైన ఫార్ములాతో గన్నవరం పంచాయతీకి ముగింపు పలికినట్లు చెబుతున్నారు. జగన్ సిద్ధాంతం ప్రకారం వల్లభనేని వంశీ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలో చేరాల్సి ఉంటుంది. అలా వంశీ రాజీనామా చేశాక, గన్నవరం నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే... యార్లగడ్డను బరిలోకి దింపాలనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక, వంశీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, వంశీకే మళ్లీ గన్నవరం బాధ్యతలు అప్పగించి, ఉపఎన్నిక బరిలోకి దింపితే, యార్లగడ్డ భవిష్యత్తు ఏమిటని వెంకట్రావు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అందుకే, వల్లభనేని వంశీ రాకను యార్లగడ్డ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇక, ఎన్నికల సమయంలోనూ, ఫలితాలకు ఒకట్రెండు రోజుల ముందువరకు కూడా యార్లగడ్డ, వంశీ మధ్య ఓ రేంజ్ వార్ నడిచింది. యార్లగడ్డ ఇంటికి తన అనుచరులను పంపడం... యార్లగడ్డకు ఫోన్లు చేయడం... లాంటి పనులతో వంశీ బెదిరింపులకు దిగారు. అయితే, ఇటీవల జగన్ ను కలిసిన తర్వాత కూడా యార్లగడ్డపై విరుచుకుపడ్డ వంశీ... ఇళ్ల పట్టాలు ఫోర్జరీ చేశానంటూ తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండానే తనపై కేసు నమోదు చేశారని, దీనిపై గవర్నర్, హైకోర్టు సీజేకి ఫిర్యాదు చేస్తానన్ని చెప్పుకొచ్చారు. అయితే పది రోజులు తిరక్కుండానే మీడియా ముందుకొచ్చిన వంశీ... జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే, యార్లగడ్డతో కూడా కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీలో చేరకముందే ఆ పార్టీలో కాకపుట్టించిన వల్లభనేని వంశీ ముందుముందు ఇంకెన్ని తలనొప్పులు తెస్తాడోనని మాట్లాడుకుంటున్నారు. జగన్ మాటను కాదనలేక ఒప్పుకున్నా... వంశీ రాకను యార్లగడ్డ జీర్జించుకోలేకపోతున్నారనే అంటున్నారు. దాంతో, ముందుముందు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనన్న చర్చ గన్నవరం వైసీపీలో జరుగుతోంది. మరి, వంశీ-యార్లగడ్డ సమైక్య రాగం ఆలపిస్తారో? లేక వేర్వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పిగా మారతారో చూడాలి.