English | Telugu

విజయసాయిని కలిసినా న్యాయం జరగలేదు.. విషం తాగిన వైసీపీ నాయకురాలు!

వైసీపీ నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడుతుండగానే విషం తాగేశారు.

తన సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలు తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారని అన్నారు. ఈ నెల 6వ తేదీన విజయసాయిరెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సీఎం జగన్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే అవకాశం తనకు రాలేదని జోని కుమారి చెప్పారు.

ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఆమె విషం తీసుకున్నారు. వెంటనే ముందున్న టేబుల్ పై తల వాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని.. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.