English | Telugu

టీడీపీకి మరో షాక్.. బీజేపీలోకి వల్లభనేని.. సుజనాతో భేటీ!!

ఏపీలో ఆపరేషన్ కమలం దెబ్బకి సైకిల్ కి పంచర్ పడేలా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల పరాజయం తరువాత పలువురు కీలక నేతలు టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టీడీపీ కోలుకోవడం కష్టమని అంటున్నారు. అయితే తాజాగా టీడీపీ శ్రేణులకు షాకిచ్చే మరో వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి బీజేపీలో చేరటానికి సిద్దమవుతున్నారంటూ ప్రచారం మొదలైంది.

నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. వంశీ పార్టీ మార్పు వార్తల వెనుక ఓ కారణముంది. తాజాగా వంశీ.. బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలిశారు. సుజనాచౌదరి కొద్దిరోజుల క్రితం టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఏపీ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, ఆయనకు టీడీపీ నేతలతో సత్సబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వంశీ సుజనాచౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశంలో జరుగుతున్న గాంధీ సంకల్ప యాత్రకు సుజనా కారులోనే వంశీ వెళ్లటం మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది. వంశీ బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయా వర్గాల్లో వినిపిస్తుంది. అంతేకాదు వంశీ ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే ఆయన టీడీపీకి షాకిస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు సుజనా చౌదరితో ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా భేటీ అయ్యారని తెలుస్తోంది. కరణం బలరాం నివాసంలో సుజనా భోజనం చేసినట్టు సమాచారం. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సుజనాతో టీడీపీ నేతల వరుస భేటీలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారిందనే చెప్పాలి.