English | Telugu

సిల్లీ రీజన్స్.. ప్రతి శుక్రవారం కారణాలు చెబుతూ కోర్టుకు గైర్హాజరవుతున్న జగన్! 

అక్రమాస్తుల ఆరోపణల కేసులో విచారణ కోసం శుక్రవారం (జనవరి 31వ తేదీన) నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన హాజరుకాలేదు. అయితే ఇందుకు సంబంధించి ఈడీ కేసులో ఉన్న ఐదు చార్జ్ షీట్ల వల్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని గత వారం సీబీఐ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో సీబీఐ కేసుల పై జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొత్తం 11 చార్జిషీట్ లకు గానూ 11 పిటిషన్ లో హైకోర్టులో వేయడం జరిగింది. 11 పిటీషన్ లకు సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి 6 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

దీంట్లో ప్రధానంగా సిబిఐ వాదించింది. జగన్ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయితేనే కేసులో పురోగతి ఉంటుందని భావించింది. కానీ A1 నిందితుడిగా ఉన్న వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల కేసు విచారణలో జాప్యం జరుగుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టుకు స్పష్టం చేయడంతో.. సీబీఐ కోర్టు ఈ విషయాన్ని హైకోర్టుకు చెప్పబోతుంది.

ప్రధానంగా ఈ రోజు హాజరు కావాల్సినా కూడా ప్రభుత్వ కార్యకలాపాల వలన తాను హాజరు కాలేకపోతున్నట్లుగా ఈ రోజు జగన్ తరుపున న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. ఇదివరకే ఈడీ కేసులో ఖచ్చితంగా హాజరుకావాలని కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. హాజరుకాని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ జగన్ హాజరుకానందున నోటీసులు జారీ చేస్తుందా?.. లేకుంటే హైకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకుంటుందా?.. అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి వ్యక్తిగత కారణాలు, ప్రభుత్వ కార్యకలాపాలు అంటూ జగన్ వారంవారం కోర్టుకి కారణాలు చెప్తుండటంతో.. కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.