English | Telugu

పోలవరం పై బీజేపీ ఎలా స్పందించబోతోంది...

ఏపీలో నిన్న మెన్నటి దాకా హల్ చల్ చేసిన పోలవరం రివర్స్ టెండరింగ్ సంగతి మనందరికి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి వంటి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై బిజెపి దృష్టి పెట్టింది. పోలవరం వ్యవహారంలో ఒక విధానమంటూ లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చిన బిజెపి ఇప్పుడు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పోలవరం పరిహారంలో అవినీతి జరిగిందని కొందరు, రివర్సు టెండర్ల వల్ల నష్టం జరిగిందని మరి కొందరు బిజెపి నేతలు ఇప్పటి వరకూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులలో ఒకటైన రాజధాని అమరావతిపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన బిజెపి నేతలు పోలవరం విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని కొందరు నేతలు ఆరోపిస్తూ వచ్చారు.

ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం వద్దంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్ లకు వెళ్లింది దీనిపై పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎంపీ సుజనా చౌదరి దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. పోలవరంపై ఇప్పటి వరకూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసిన బిజెపి నేతలు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతం నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజెపి ఇప్పుడు ప్రాజెక్టు విజిట్ కు ప్లాన్ చేసింది. ఈ నెల పదకొండు న బీజేపీ బృందం పోలవరం ప్రాంతాన్ని సందర్శించనుంది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ముంపు ప్రాంతాల్లో పరిహారానికి సంబంధించి జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై దృష్టి పెట్టనుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, అసలు బిజెపి ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతుందనేది తేలాల్సివుంది. ఓవైౖపు రివర్స్ టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షంతో పాటు కేంద్రమంత్రి కూడా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు రివర్స్ టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఆదా చేసినట్టు ప్రకటించింది. దీనిపై ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంది అనేది కూడా తేలాల్సి ఉంది.

మరోవైపు కేంద్రం నుంచి పోలవరానికి సంబంధించి ఆరువేల కోట్లు పెండింగ్ నిధులు విడుదల కావలసి ఉంది, వాటిని ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీంతో అసలు పోలవరం విషయంలో బిజెపి లైన్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కొందరు నేతలు పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పోలవరంపై బిజెపి స్లోగన్ ఏంటి అనేది క్లారిటీ రావాల్సివుంది. పోలవరం టూర్ తర్వాత పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందిస్తారా, గతంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తారా, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తారా లేదా అసలు పోలవరం అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయం సంచలనంగా మారింది.