English | Telugu
ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంటగా మారిన ఆర్టీసీ కార్మికులు సమ్మె...
Updated : Oct 5, 2019
ఆర్టీసీ కార్మికులు సమ్మె తెలంగాణలో ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంట పండిస్తోంది. అసలు చార్జీలకు అధికంగా ఎన్నో రెట్లు ఎక్కువ సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తూ ప్రజల దగ్గర నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ టాక్సీలు అయితే సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు వేలల్లో చార్జీలు చెప్తూ హడలెత్తిస్తున్నాయి. కొంతమంది ఎలాగైనా ఊరికి వెళ్ళాలని తపనతో వేలకు వేలు పోసి కుటుంబాలతో సహా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.
ప్రైవేటు వాహన యజమానులకు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వాళ్లు ఏకంగా బస్టాండ్ లోని ప్లాట్ ఫాంల మీద వాహనాలు నిలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దన్న అధికారుల సూచనని ఏమాత్రం పట్టించుకోకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు గట్టిగా అడిగితే డీజిల్ రేట్లు పెరిగాయని ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకపోతే చిన్న వాహనాలకు గిట్టుబాటు కాదని, ఇష్టముంటే ఎక్కండి లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు దాంతో ప్రయాణికులు ఆర్థికంగా భారమైనా సరే ప్రైవేటు వాహనాలలోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు అరకొరగా నడుస్తున్నా వాటి లోని సిబ్బంది కూడా రెండు మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బస్టాండ్ లో ప్రయాణికులను ఎక్కించుకుంటున్న తాత్కాలిక సిబ్బంది బస్సులు ఊరి బయటికి చేరుకోగానే ఇష్టం వచ్చినంత సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సు దిగి వెళ్ళిపోయే అవకాశం లేకపోవటంతో ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ మొత్తం మీద ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా పది శాతం బస్సులు కూడా రోడ్డెక్కలేదు. దాంతో ప్రైవేట్ వాహనాలదే ఇష్టా రాజ్యం అయిపోయింది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం ఇటు కార్మికులు పంతానికి పోయి చివరికి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చాలా చోట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.