English | Telugu
గులాబీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్?
Updated : Aug 25, 2020
కరోనా కట్టడి, వరదలు, పంట నష్టం విషయాల్లోనూ ప్రభుత్వ తీరు సరిగా లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న వేళ కేసీఆర్.. ప్రజలను గాలికోదిలేశారనే వాదన ఉంది. కరోనాతో ప్రజలు చనిపోతున్నా ముఖ్యమంత్రి స్పందించలేదని, ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి. జనాలు కూడా కరోనా కట్టడిలో సర్కార్ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వరదలు వచ్చినా.. క్షేత్రస్థాయి అధికారులు సరిగా స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత కనిపిస్తుండటంతో గులాబీ పార్టీలో మండలి ఎన్నిక గుబులు రేపుతోంది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలను విపక్షాలు సవాల్ గా తీసుకుంటున్నాయి. టీజేఎస్ ఛైర్మెన్ కోదండరామ్ నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కోదండరామ్ కు ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు ఇవ్వొచ్చని వారు భయపడుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో కోదండరామ్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కోదండరామ్ గెలిస్తే కేసీఆర్ కు ఇబ్బందులే. హైద్రాబాద్ స్థానంలో బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఉద్యోగ సంఘం నేత దేవిప్రసాద్ ను బరిలోకి దింపినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఉద్యోగులంతా సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నందున.. ఈసారి గెలవడం దాదాపు అసాధ్యమనే చర్చ అంతర్గతంగా టీఆర్ఎస్ లో జరుగుతోంది. హైద్రాబాద్ పై ఎలాగు ఆశలు లేవు.. నల్గొండలో కూడా ఓడిపోతే పార్టీ పరువు పోతుందని మరికొందరు నేతలు భయపడుతున్నారు. పోటీ చేసి ఇబ్పందులు పడేకంటే.. పోటీ చేయకుండా ఎవరికైనా తటస్థులకు లోపాయకారిగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కారు పార్టీకి సవాల్ గా నిలువబోతున్నాయి. మరీ కేసీఆర్ ఎలా ముందుకు వెళతారో చూడాలి.