English | Telugu
కుంభమేళా తర్వాత మేడారమే... మహా జాతరకు హెలికాప్టర్లు...
Updated : Feb 3, 2020
సమ్మక్క సారక్క జాతర... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ... ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ...తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తోంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం సకల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక, మేడారం వెళ్లేందుకు ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక రైళ్లు, బస్సులను నడుపుతుండగా.... తెలంగాణ టూరిజం... హెలికాప్టర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి మేడారానికి హెలికాప్టర్లను నడుపుతోంది.
హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే ప్రతి హెలికాప్టర్లో మొత్తం ఆరుగురు ప్రయాణించవచ్చు. అందుకు లక్షా 80వేలు ఛార్జ్ చేస్తారు. అలాగే, జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మేడారం తీసుకెళ్లడమే కాకుండా గద్దె దగ్గర వీఐపీ దర్శనం కల్పిస్తారు. ఇక, మేడారం జాతర ప్రాంగణాన్ని హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఒక్కొక్కరి 2999 రూపాయల చొప్పున రేట్ ఫిక్స్ చేశారు. హెలికాప్టర్ సదుపాయం కోసం 94003 99999 నెంబర్ ను కాంటాక్ట్ చేయొచ్చని తెలంగాణ టూరిజం ప్రకటించింది.
అయితే, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతి మధ్య జరిగే మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, హెలికాప్టర్ ద్వారా దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతిని, లక్షలాది మంది భక్తుల్ని తిలకించడం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.