English | Telugu
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ... ఢిల్లీలో మోడీతో కేసీఆర్ మీటింగ్...
Updated : Oct 4, 2019
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.... తెలంగాణ సమస్యలను, అవసరాలను ప్రధాని నరేంద్రమోడీ ముందు పెట్టనున్నారు. మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, మొదటిసారి సమావేశమవుతోన్న కేసీఆర్... ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్‌భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థలో మార్పులు, రిజర్వేషన్ల పెంపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, యురేనియం తవ్వకాల నిలిపివేత, హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన రహదారికి జాతీయ హోదా, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, ఏదోఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఏపీతో కలిసి చేపడుతోన్న గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఆర్ధిక సహకారం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు ఉంచనున్నారు. అలాగే, తెలంగాణకి సంబంధించి పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
అయితే, ఎన్నికలకు ముందు బీజేపీని, మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతుండటం, అలాగే, తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పొలిటికల్ వార్ మారుతోన్న క్రమంలో కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపైనా కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో... మోడీతో మీటింగ్ ఆసక్తి కలిగిస్తోంది.