English | Telugu

సీఎంవో అధికారిని బలి తీసుకున్న కరోనా

మన దేశంలో కరోనా కేసులు సంఖ్య దాదాపుగా మూడున్నర లక్షలకు చేరుకొంది. ఈ మొత్తం కేసులలో సగం పైగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రప్రభుత్వం మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లుగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కార్యాలయ కార్యదర్శి కరోనాతో మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఆయన వయసు 51 సంవత్సరాలు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను ముసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం లోని అత్యున్నత స్థాయి అధికారి కరోనాతో చనిపోవడంతో తమిళనాడులో కలవరానికి దారితీసింది. సీనియర్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయన వారం రోజులుగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుప్రతిలో చికిత్సపొందుతున్నారు. కుటుంబ సభ్యులు సైదాపేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మరణంతో సెక్రటేరియట్ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు తమిళనాడు సెక్రటేరియట్‌లో 200 మంది వరకు ఉద్యోగులు కరోనా బారిన పడినట్టు సమాచారం అందుతోంది. వీరిలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సెక్రటేరియట్‌ను మూసివేయాలని సెక్రటేరియట్‌ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం గర్భిణీలు, 50 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాళిక వ్యాధులతో, శ్వాసకోస ఇబ్బందులతో బాధపడేవారిని విధుల నుంచి మినహాయించాలని వారు కోరుతున్నారు.