English | Telugu

ధోనీ హీరో సుశాంత్ ఆత్మహత్య

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్.. ‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సుశాంత్ సింగ్ లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు.

కాగా, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 8న ముంబైలోని మలాద్‌లో ఓ భవంతి 14వ అంతస్తు నుంచి దూకి దిశా బలవన్మరణానికి పాల్పడ్డారు. దిశా ఆత్మహత్య చేసుకున్న వారానికే, సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలన సృష్టిస్తోంది. దిశా ఆత్మహత్య ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సుశాంత్ ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాంతో సుశాంత్ కొంత మానసిక వేదనకు గురయ్యాడని సమాచారం. అయితే, సుశాంత్ చాలా రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని.. ఆయన మానసిక స్థితి కూడా బాగోలేదని సన్నిహితులు అంటున్నారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు పోలీసులు, ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణమేంటో స్పష్టంగా తెలియడంలేదు.

1986 జనవరి 21న పట్నాలో జన్మించిన సుశాంత్‌ సింగ్‌.. పలు టీవీ సీరియళ్లలో నటించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'ఎంఎస్ ధోని', 'కేదారనాథ్', 'చిచ్చోరె' లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా బోలెడంత భవిష్యత్ ఉన్న సుశాంత్.. ఇలా ఆత్మహత్య చేసుకొని తన ప్రస్థానానికి ముగింపు పలకడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.