English | Telugu

జగన్ ను సీఎం పదవి నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో పిల్.. నేడే విచారణ

ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిర్గతం చేయడంతో పాటు సుప్రీం కోర్టులోని రెండో సీనియర్ మోస్ట్ జడ్జి.. జస్టిస్ ఎన్వీ రమణ పై ఎటువంటి ఆధారాలు లేకుండా.. ప్రజల ముందు, మీడియా ముందు.. అసత్య ఆరోపణలు చేసారని పేర్కొంటూ ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపి జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి... ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ పిల్‌లో కోరారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది.

సుప్రీం కోర్టు లాయర్లు జిఎస్ మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్... దాఖలు చేసిన పిల్ లో "సీఎం జగన్ పై విదేశాలకు డబ్బు అక్రమ తరలింపు, అవినీతి సహా 20కి పైగా చాలా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు నుంచి వ్యక్తిగత ప్రయోజనాలను పొందేందుకు... తన సీఎం పదవిని, అధికారాలను ఉపయోగించుకొని.. బహిరంగంగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిగా ఉన్నవారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ఆయన ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థను మసకబార్చారు" అని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జిలతో రాజ్యాంగబద్ధంగా ఓ అంతర్గత కమిటీ వేసి.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలనీ, అదే సమయంలో సీబీఐతో కూడా దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు.