English | Telugu

ఊరి మీద పగ.. 23 మంది పిల్లలను బందీ చేశాడు.. కమాండోల చేతుల్లో హతమయ్యాడు

యూపీలోని ఫరూఖాబాద్ లో 23 మంది చిన్నారులని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరస్థుడిని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లులని రక్షించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో కలకలం సృష్టించింది. ఫరూకాబాద్ కు చెందిన సుభాష్ బాదం అనే వ్యక్తికి ఒక హత్య కేసులో జీవిత ఖైది పడింది. ప్రస్తుతం పెరోల్ మీద బయటకు వచ్చాడు. నిన్న ( జనవరి 30వ తేదీన ) మధ్యాహ్నం గ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఇళ్లకు వెళ్లి తన కుమార్తె పుట్టిన రోజు ఉందని వెంటనే పిల్లల్ని పంపించాలని అందరిని కోరాడు. తాను మారిపోయిన వ్యక్తినని అందరినీ నమ్మించడంతో వారంతా నిజమే అనుకొని తమ పిల్లలను బర్తడే ఫంక్షన్ నిమిత్తం సుభాష్ తో అతనింటికి పంపారు. ఒకరిద్దరు తల్లులైతే తోడుగా కూడా వెళ్ళారు. అందరూ వచ్చాక ఇంటికింద ఉన్న సెల్లార్ లోని గదుల్లో కూర్చోబెట్టాడు. లోపల్నుంచి గడియలు వేసేసి తాళాలు కూడా వేసి వారందరినీ బందీలుగా చేశాడు. ఆఖరికి తన భార్యాపిల్లలను కూడా బందీలుగా పెట్టాడు.

ఎంతసేపటికీ తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి వీధిలోని కొందరి తండ్రులు అక్కడికి వచ్చి వాకబు చేసేందుకు ప్రయత్నించగా సుభాష్ లోపలి నుంచే వారిని బయటకు తరిమేశాడు. పిల్లల గురించి మాట్లాడితే కాల్చిపడేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత సుభాష్ ఇంటి దగ్గరికి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మరో గ్రామస్థుడి పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను ఎవరితోనూ మాట్లాడనని ఎమ్మెల్యేను పిలిపించాలని చెప్పాడు. వెంటనే భోజ్ పూర్ ఎమ్మెల్యే నాగేంద్ర సింగ్ కు కబురుపెట్టారు. సాయంత్రానికి నాగేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ఆయనను కలవడానికి కూడా సుభాష్ ఒప్పుకోలేదు. అర్థరాత్రిదాకా ఈ బందీ డ్రామా కొనసాగింది. నిందితుడు ఏడాది ఒక్క నెల వయసు ఉన్న పాపను మాత్రమే బయటకు వదిలి పెట్టాడు.

సుభాష్ చెరలో 23 మంది పిల్లలు ఉన్నట్టు తెలియడంతో ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కమెండోలను అక్కడికి పంపించారు. వారిపై కాల్పులు జరిపిన సుభాష్ ఓ గ్రెనేడ్ కూడా విసిరేశాడు. పిల్లలని ఏమీ చేయకుండా లొంగిపోవాలంటూ కమేండోలు విజ్ఞప్తి చేసినా సుభాష్ వెనక్కి తగ్గలేదు. దీంతో బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన కమాండోలు అతడిని కాల్చి చంపారు. 10 గంటల తర్వాత 23 మంది చిన్నారులను వారి తల్లులను విడిపించారు. సుభాష్ ఓ మహిళ హత్య కేసులో దోషి. ఆ హత్యతో తనకు సంబంధం లేదని ఆ సమయంలో తాను ఆ చోటే లేనని వాదించాడు. కాని గ్రామస్తులు కొందరు అతను ఉన్నాడని చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఊరి మీదనే కోపం పెంచుకున్నాడు సుభాష్. సుభాష్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్పారు.