English | Telugu

ప్లాస్టిక్ మేమే బ్యాన్ చేస్తున్నాం.. బ్యాగ్ తెచ్చుకోండి లేదా మా దగ్గరే కొనుక్కోండి

ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేయడంతో వ్యాపారస్తులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. పేపర్ బ్యాగ్స్ వాడుతున్నారు. వీటి వాడకం కూడా పర్యావరణానికి కాస్త ఇబ్బందనే అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. పేపర్ బ్యాగ్స్ చేయాలంటే చెట్లు నరకాల్సిందే.. ఇప్పటికే గ్లోబల్ ఎఫెక్ట్..కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటున్నారు ప్రజలు. ప్రస్తుతానికి ప్లాస్టిక్ ను తగ్గించేందుకు పేపర్ బ్యాగ్స్ వాడినా.. భవిష్యత్తులో మాత్రం జూట్, బట్ట సంచులనే వాడతామంటున్నారు వ్యాపారులు. ప్లాస్టిక్ ని బ్యాన్ చెయ్యాలంటే అది ఫ్యాక్టరీల నుంచే మొదలు కావాలి. కొంతమంది వ్యాపారుల సైతం తమను తామే ప్లాస్టిక్ నిషేదం పై ఆంక్షలు పెట్టుకున్నారు.

ఒక వ్యాపారి అరటిపండ్లను న్యూస్ పేపర్ లలో చుట్టి ఇస్తూ ప్లాస్టిక్ వాడొద్దని జనాన్ని చైతన్యపరుస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ లను తగ్గించేందుకు పేపర్ లను వాడుతున్నామన్నారు పండ్ల వ్యాపారులు. మేము నష్ట పోయినా పర్లేదు ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశం తోనే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. తమ దగ్గరకు వచ్చే కొనుగోలుదారులు ఖచ్చితంగా బ్యాగులు తెచ్చుకోవాలంటున్నారు వ్యాపారులు. రైతు బజార్ లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతు బజార్ లలో కొందరు జూట్ బ్యాగ్ లతో కనిపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ నివారణ సాధ్యపడుతుంది. ఏదైనా మనవరకు వస్తే కానీ తెలీదు అంటారు.. పర్యావరణాన్ని కాపాడండి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు ప్రాణాపాయ సంకేతాలు కనిపించగానే ఎప్పుడు లేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.