English | Telugu

కరోనాతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఉత్తరాదిలో కరోనా సేకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా పాటిజివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి మరో ఎమ్మెల్యేను బలి తీసుకుంది. రాజస్థాన్ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన మహిళా ఎమ్మెల్యే వయసు 59 ఏండ్లు. రాజ్‌సమండ్ నియోజకవర్గం నుంచి కిరణ్ మహేశ్వరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరోనా సోకడంతో ఆమె గత కొన్ని రోజుల నుంచి గురుగ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. మహేశ్వరి మృతిపట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు సంతాపం తెలిపారు.